ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో ధర్మశాల వేదికగా జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. అర్ష్‌దీప్ సింగ్(3/25), హర్షిత్ రాణా(2/34), వరుణ్ చక్రవర్తీ(2/11), కుల్దీప్ యాదవ్(2/12) రెండేసి వికెట్లతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 117 పరుగులకే కుప్పకూలింది.
కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో రాణించగా.. డోనవన్ ఫెర్రెయిరా(15 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 20), అన్రిచ్ నోర్జ్(12) డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలకు కూడా చెరో వికెట్ దక్కింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు తొలి ఓవర్‌లోనే బిగ్ షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రీజా హెన్రీక్స్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే డికాక్(1)ను హర్షిత్ రాణా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. తన మరుసటి ఓవర్‌లో డేంజరస్ డెవాల్డ్ బ్రెవిస్(1)ను రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లేలోనే సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 25 పరుగులు మాత్రమే చేసింది. పవర్ ప్లే మరుసటి ఓవర్‌లోనే ట్రిస్టన్ స్టబ్స్(9)ను హార్దిక్ పాండ్యా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి టీ20ల్లో 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు.
కార్బిన్ బోష్‌ను శివమ్ దూబే క్లీన్ బౌల్డ్ చేయగా.. డోనవన్ ఫెర్రెరియా సాయంతో మార్క్‌రమ్ దూకుడుగా ఆడాడు. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డోనవన్ ఫెర్రీరియా(22)తో పాటు మార్కో జాన్సెన్(2)లను వరుణ్ చక్రవర్తీ తన వరుస ఓవర్లలో క్లీన్ బౌల్డ్ చేయడంతో 77 పరుగులకే సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అన్రిచ్ నోర్జ్(12) సాయంతో ఒంటరి పోరాటం చేసిన మార్క్‌రమ్ జట్టు స్కోర్‌ను 100 పరుగులు ధాటించాడు. ఆచితూచి ఆడిన అతన్ని అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేయగా.. అన్రిచ్ నోర్జ్(12), ఒట్నిల్ బార్ట్‌మన్(1)లను కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్‌లో ఔట్ చేసి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు తెరదించాడు.