IND vs SA:రఫ్ఫాడించిన కుల్దీప్ యాదవ్.. సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం!
IND vs SA: సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన చివరి టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 106 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. యశస్వి జైస్వాల్(41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్, లిజాడ్ విలియమ్స్ రెండేసి వికెట్లు తీయగా.. నాండ్రె బర్గర్, టబ్రైజ్ షంసీ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. కుల్దీప్ యాదవ్(5/17) ధాటికి 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ మిల్లర్(35), ఎయిడెన్ మార్క్‌రమ్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు తోడుగా రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ తీసారు.
భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా సూర్యకుమార్ యాదవ్ చేసిన పరుగులు కూడా చేయలేకపోయింది.
భారీ లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికాను మహమ్మద్ సిరాజ్ వణికించాడు. కట్టుదిట్టమైన బంతులతో తొలి ఓవర్‌ను మెయిడిన్ చేశాడు. దాంతో ముఖేష్ కుమార్ వేసిన మరుసటి ఓవర్‌లో ఓపెనర్ మాథ్యూ బ్రీట్జ్కీ(4)క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ కొద్ది సేపటికే మహమ్మద్ సిరాజ్ సూపర్ త్రోకు మరో ఓపెనర్ రీజా హెండ్రీక్స్(8) రనౌటయ్యాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ బౌండరీలతో జోరు కనబర్చగా.. మరోవైపు హెన్రీచ్ క్లాసెన్(5)ను అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో సౌతాఫ్రికా పవర్ ప్లేలో 3 వికెట్లకు 42 పరుగులే చేసింది.
ఆ వెంటనే జడేజా ఎయిడెన్ మార్క్‌రమ్(25)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇక జడేజా వేసిన 9వ ఓవర్‌లో డేవిడ్ మిల్లర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు.
ఈ ఓవర్ నాలుగో బంతి మిల్లర్ బ్యాట్‌ను ముద్దాడి కీపర్ చేతిలో పడింది. కానీ అంపైర్ నాటౌటిచ్చాడు. సాంకేతిక సమస్యతో రివ్యూకు అవకాశం లేకపోవడంతో మిల్లర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. డోనోవన్ పెర్రెయిరా(12)ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. అండిలే పెహ్లుక్వాయో(0)ను జడేజా రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
కేశవ్ మహరాజ్(1), నండ్రే బర్గర్(1), లిజార్డ్ విలియమ్స్(0)లను కుల్దీప్ యాదవ్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే డేవిడ్ మిల్లర్(35)ను క్లీన్ బౌల్డ్ చేసిన కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్ల ఘనతను అందుకోవడంతో పాటు టీమిండియా విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications