సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా పుంజుకుంది. రెండో టీ20 పరాజయం నుంచి త్వరగానే తేరుకున్న భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన భారత్ 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 117 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లలో డోనవన్ ఫెర్రెయిరా(15 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 20), అన్రిచ్ నోర్జ్(12) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/25), హర్షిత్ రాణా(2/34), వరుణ్ చక్రవర్తీ(2/11), కుల్దీప్ యాదవ్(2/12) రెండేసి వికెట్లతో సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 120 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35) తన జోరు కొనసాగించగా.. శుభ్‌మన్ గిల్(28 బంతుల్లో 5 ఫోర్లతో 28), సూర్యకుమార్ యాదవ్(11 బంతుల్లో 2 ఫోర్లతో 12) మరోసారి తడబడ్డారు. తిలక్ వర్మ(34 బంతుల్లో 3 ఫోర్లతో 26 నాటౌట్), శివమ్ దూబే(4 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 10 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.
సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 బుధవారం లక్నో వేదికగా జరగనుంది.
జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్‌తో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హర్షిత్ రానా 34 పరుగులిచ్చినా.. డేంజరస్ క్వింటన్ డికాక్, డేవాల్డ్ బ్రెవిస్‌లను ఔట్ చేసి మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పాడు. అతనికి తోడుగా ఇతర బౌలర్లు కూడా చెలరేగడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది.
బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అతని దూకుడైన బ్యాటింగ్‌తో భారత్ విజయం సులువైంది. గిల్ తడబడినా.. అభిషేక్ విధ్వంసంతో భారత్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. దాంతో తర్వాత వచ్చిన బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు.