టెస్ట్ క్రికెట్‌లో టీమిండియాకు మరో ఘోర పరాభావం ఎదురైంది. సొంతగడ్డపై మరో టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. సౌతాఫ్రికాతో గౌహతి వేదికగా బుధవారం ముగిసిన రెండో టెస్ట్‌లో టీమిండియా 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో సౌతాఫ్రికా 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి సరికొత్త చరిత్రను లిఖించింది. 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై భారత్‌ను ఓడించింది.
549 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా 27/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా(87 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

యశస్వి జైస్వాల్(13), కేఎల్ రాహుల్(6), సాయి సుదర్శన్(14), కుల్దీప్ యాదవ్(5), ధ్రువ్ జురెల్(2), రిషభ్ పంత్(13), వాషింగ్టన్ సుందర్(16), మహమ్మద్ సిరాజ్(0) తీవ్రంగా నిరాశపర్చారు. సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మర్(6/37) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, సీనర్ ముత్తుసామి తలో వికెట్ తీసారు.
రెండో ఇన్నింగ్స్‌ల్లో కలిపి భారత్.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను కూడా చేయలేకపోయింది. రోడ్డులాంటి పిచ్‌పై భారత బ్యాటర్లు విఫలమవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ చేసింది. సెనరన్ ముత్తుసామి(206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109) సెంచరీ సాధించగా.. మార్కో జాన్సెన్(91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 93) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(58), వాషింగ్టన్ సుందర్(48) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. మార్కో జాన్సెన్ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ డ్రా అయినా సిరీస్‌ను ఆ జట్టే కైవసం చేసుకుంటుంది.
సంక్షిప్త స్కోర్లు..
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 489 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 201 ఆలౌట్
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 260/5 డిక్లేర్డ్
భారత్ రెండో ఇన్నింగ్స్ 140 ఆలౌట్