టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్(6/15) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. కేప్‌టౌన్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్ట్‌లో సిరాజ్‌తో పాటు ముఖేష్ కుమార్(2/0), జస్‌ప్రీత్ బుమ్రా(2/25) రెండేసి వికెట్లు తీయడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 23.2 ఓవర్లలోనే తొలి ఇన్నింగ్స్‌ను ముగించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు నాలుగో ఓవర్‌లోనే సిరాజ్ షాకిచ్చాడు. ఎయిడెన్ మార్క్‌రమ్(2) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్‌లో గత మ్యాచ్ సెంచరీ హీరో, కెప్టెన్ డీన్ ఎల్గర్(4)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే ట్రిస్టన్ స్టబ్స్‌ను బుమ్రా క్యాచ్ ఔట్ చేయగా.. టోనీ డీ జోర్జాయ్(2)ను సిరాజ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.

దాంతో సౌతాఫ్రికా తొలి 10 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో డేవిడ్ బెడింగ్‌హమ్(12), కైల్ వెర్రెన్నె(15) నిలకడగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ సిరాజ్ ఒకే ఓవర్‌లో డేవిడ్ బెడ్డింగ్‌హమ్‌తో పాటు మార్కో జాన్సెన్(0)ను పెవిలియన్ చేర్చాడు. ఇన్‌స్వింగర్ వేయాలనే కోహ్లీ సూచనతో సిరాజ్.. మార్కో జాన్సెన్ వికెట్ సాధించాడు. ఈ వికెట్‌తో సిరాజ్ ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
ఆ కొద్దిసేపటికే కైల్ వెర్రెయన్నె(15) కూడా ఔట్ చేయడంతో సౌతాఫ్రికా తీవ్ర కష్టాల్లో పడింది. ముఖేష్ కుమార్.. కేశవ్ మహరాజ్(3), కగిసో రబడా(5)లను వరుస ఓవర్లలో ఔట్ చేయగా.. నండ్రే బర్గర్(0)ను బుమ్రా చివరి వికెట్‌గా పెవిలియన్ చేర్చి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌కు తెరదించాడు. తొలి సెషన్‌లోనే సౌతాఫ్రికా ఆలౌటవ్వడం విశేషం.
ఈ ఏడాది టీమిండియాకు ఇదే తొలి మ్యాచ్ కాగా.. బౌలర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. సంచలన బౌలింగ్ ప్రదర్శనతో సౌతాఫ్రికాకు ఓ పీడ కలగా మిగిల్చారు.