టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. సౌతాఫ్రికాతో కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే. నిద్రలో మెడలు పట్టేసినా.. పెయిన్ కిల్లర్స్ సాయంతో బ్యాటింగ్‌కు దిగిన శుభ్‌మన్ గిల్ మూడే మూడు బంతులు ఆడి రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ మూడు బంతుల్లో గిల్ ఓ బౌండరీ బాదాడు.
అయితే ఈ బౌండరీ బాదే క్రమంలో అతని మెడ నరాలపై ఒత్తిడి పడి నొప్పి తీవ్రమైంది. దాంతో అతను బ్యాటింగ్ చేయలేక మైదానం వీడాడు. మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. సాయంత్రానికి నొప్పి తీవ్రం కావడంతో గిల్‌ను కోల్‌కతాలోని వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. 24 గంటల తర్వాత అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. గిల్‌కు విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు.

దాంతో అతను రెండో టెస్ట్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ తాజాగా గిల్ గాయానికి సంబంధించి ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. శుభ్‌మన్ గిల్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని స్పష్టం చేసింది.
'కోల్‌కతా టెస్ట్‌లో మెడ గాయానికి గురైన శుభ్‌మన్ గిల్‌ను ఆసుపత్రికి తరలించారు. ఒక రోజు అబ్జర్వేషన్‌లో ఉంచి తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అతను వైద్య చికిత్సకు బాగానే స్పందిస్తున్నాడు. భారత జట్టుతో కలిసి రెండో టెస్ట్ వేదికైన గౌహతికి బుధవారం బయల్దేరుతాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. అతని పరిస్థితిని బట్టి రెండో టెస్ట్ ఆడే విషయంపై టీమ్‌మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకుంటుంది.'అని బీసీసఐ ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ రెండో టెస్ట్‌కు అందుబాటులో ఉన్నాడని ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.
కోల్‌కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేకపోయింది. శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేయకపోవడం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ పరాజయం నేపథ్యంలో రెండో టెస్ట్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం నుంచి గౌహతి వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.