సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ముందు 124 పరుగుల లక్ష్యం నమోదైంది. 30 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 153 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ టెంబా బవుమా(136 బంతుల్లో 4 ఫోర్లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. కార్బిన్ బోష్(37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) పర్వలేదనిపించాడు. మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(4/50) నాలుగు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/30), మహమ్మద్ సిరాజ్(2/2) రెండేసి వికెట్లు పడగొట్టారు. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్‌కు చెరో వికెట్ దక్కింది. 124 పరుగుల లక్ష్యాన్ని చేధించడం టీమిండియాకు అంత సులువేం కాదు. పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలిస్తోంది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి. లేకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. పైగా గిల్ గాయంతో దూరమవడంతో భారత్ 9 మందితోనే బ్యాటింగ్ చేయాల్సి ఉంది.

93/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఆశించిన ఆరంభం దక్కింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు టెంబా బవుమా, కార్బిన్ బోష్(25) ఆచితూచి ఆడారు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఓవర్‌నైట్ స్కోర్‌కు 42 పరుగులు జోడించి క్రీజులో సెట్ అయిన ఈ జోడీని జస్‌ప్రీత్ బుమ్రా విడదీసాడు. స్టన్నింగ్ డెలివరీతో కార్బిన్ బోష్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
క్రీజులోకి వచ్చిన సిమన్ హర్మర్ సాయంతో టెంబా బవుమా 122 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బవుమాకు అండగా నిలిచిన సిమన్ హర్మర్(7)ను స్టన్నింగ్ డెలివరీతో మహమ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అతని వేగం ధాటికి ఆఫ్ స్టంప్ మధ్యలోకి విరిగిపోయింది. ఇదే ఓవర్ ఆఖరి బంతికి స్టన్నింగ్ యార్కర్‌తో కేశవ్ మహరాజ్(0)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ముగిసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకు ఆలౌటవ్వగా.. భారత్ 189 పరుగులు చేసి 30 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.