సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా అసలు సిసలు సమరానికి సిద్దమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆతిథ్య సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. సౌతాఫ్రికా గడ్డపై ఇప్పటివరకూ టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకోలేకపోయిన భారత జట్టు.. ఈ సారి చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో ఉంది.
ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై 8 సార్లు టెస్ట్ సిరీస్ ఆడిన టీమిండియా.. ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. గత పర్యటనలో(2021-22)నూ టీమిండియాకు ఓటమే ఎదురైంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు జట్టులో చాలా మార్పులు జరిగాయి. కెప్టెన్‌తో పాటు ఆటగాళ్లు మారారు. గత పర్యటనతోనే టీమిండియా కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పాడు.

అత్యంత వివాదాస్పద ఘటనగా ఇది నిలిచిపోయింది. 2021 టీ20 ప్రపంచకప్ పరాజయం అనంతరం కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతలను వదులుకోగా.. బీసీసీఐ వన్డే కెప్టెన్సీని కూడా తొలగించింది. ఈ నిర్ణయంపై కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కనీస సమాచారం లేకుండా తొలగించారని ఆరోపించాడు. అంతేకాకుండా టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పి తన నిరసనను గట్టిగా వినిపించాడు. అప్పటి నుంచి రోహిత్ శర్మ టీమిండియా సారథ్య బాధ్యతలను పూర్తి స్థాయిలో అందుకున్నాడు.
గత పర్యటనలో కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ.. తాజా టూర్‌లో ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు. అంతేకాకుండా గత పర్యటనలో ఉన్న సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు ఈసారి లేరు. అసలు టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటరే ప్రస్తుత జట్టులో లేడు. పుజారా, రహానే లేకుండా టెస్ట్ సిరీస్ ఆడటం 2006 తర్వాత ఇదే తొలిసారి. గత పర్యటనలో ఈ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. దాంతో ఈ ఇద్దరిపై టీమిండియా మేనేజ్‌మెంట్ వేటు వేసింది. శ్రీలంకతో సిరీస్‌లో రీ ఎంట్రీ ఇచ్చినా.. మళ్లీ చోటు దక్కించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కెరీర్ ముగిసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గత పర్యటనలో ఉన్న రహానే, పుజారాతో పాటు మయాంక్ అగర్వాల్, వృద్దిమాన్ సాహా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, రిషభ్ పంత్, మహమ్మద్ షమీ, ప్రియాంక్ పాంచల్, హనుమ విహారి, జయంత్ యాదవ్ ఇప్పుడు లేరు. యశస్వి జైస్వాల్, కేఎస్ భరత్, ముకేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణ కొత్తగా జట్టులోకి వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సారైన టీమిండియా టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని అభిమానులు కోరుతున్నారు.