
సెంచూరియన్: మూడు దశాబ్దాలుగా సౌతాఫ్రికా గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్ట్ సిరీస్ విజయాన్ని ఈ సారైన దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న భారత జట్టుకు వరుణుడు ఓ గండంలా మారాడు. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం మొదలైన తొలి టెస్ట్‌లో టీమిండియా మంచి ఆరంభాన్ని అందుకుంది. తొలి రోజు ఆటలో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అదే జోరును రెండో రోజు కూడా కొనసాగించి భారీ స్కోర్ చేయాలని భావించిన కోహ్లీసేనకు వర్షం రూపంలో ఊహించని షాక్ తగిలింది.
వర్షం కారణంగా రెండో రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు. ఉదయం నుంచి వస్తూ పోతూ ఉన్న వర్షం.. ఆటకు అంతరాయం కలిగిస్తుంది. గంట సేపటి క్రితం వర్షం ఆగిపోవడంతో మైదాన సిబ్బంది చమటోడ్చి సిద్దం చేయగా.. మ్యాచ్ ప్రారంభానికి ముందే మళ్లీ వర్షం మొదలైంది. దాంతో వారి కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయ్యింది. ఇప్పటికీ వర్షం పడుతూనే ఉండటంతో తొలి సెషన్ ఆట తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది.
ఇక సౌతాఫ్రికా వెదర్ ఫోర్ కాస్ట్ ప్రకారం.. మూడు, నాలుగో రోజు వర్షం వచ్చే సూచన లేకున్నా చివరి రోజు అంతరాయం కలిగించనుంది. ఈ క్రమంలో ఈ రోజు ఆట తుడిచి పెట్టుకుపోతే ఈ ఫస్ట్ టెస్ట్ ఫలితం లేకుండా ముగిసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇదే భారత అభిమానులను కలవరపెడుతోంది.
ఓపెనర్ కేల్ రాహుల్ (248 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 122 బ్యాటింగ్) అజేయ సెంచరీ సాధించడంతో తొలి రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు సాధించింది. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (123 బంతుల్లో 9ఫోర్లతో 60) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రాహుల్.. మయాంక్‌తో తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించాడు.
ఆ తర్వాత కోహ్లీ (94 బంతుల్లో 4ఫోర్లతో 35), అజింక్యా రహానే ( 81 బంతుల్లో 8 ఫోర్లతో 40 బ్యాటింగ్)తో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. పుజారా డకౌటయ్యాడు. భారత్ కోల్పోయిన మూడు వికెట్లనూ ఎంగిడి (3/45) పడగొట్టాడు. మిగతా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు.