టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన సహనాన్ని కోల్పోయాడు. సునాయస క్యాచ్ వదిలేసిన సర్ఫరాజ్ ఖాన్‌పై చేయి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రధాని ఎలెవన్‌తో జరుగుతున్న టీమిండియా పింక్ బాల్ సన్నాహక మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హర్షిత్ రాణా వేసిన 23వ ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ సామ్ కోన్‌స్టాస్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వికెట్ల వెనుకాల సర్ఫరాజ్ ఖాన్ నేలపాలు చేశాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ వెంటనే.. అతని వీపు గట్టిగా కొట్టాడు. ఈజీ క్యాచ్ పట్టవా? అంటూ నవ్వుతూ మందలించాడు.

పింక్ బాల్‌తో వికెట్ కీపింగ్ చేయడం కష్టం. కీపర్లు గాయపడే అవకాశం ఉండటంతో ఈ సన్నాహక మ్యాచ్‌కు రెగ్యులర్ వికెట్ కీపర్లు అయిన రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్‌ను దూరంగా ఉంచారు. దాంతో సర్ఫరాజ్ ఖాన్ వికెట్ కీపింగ్ చేశాడు. ఒక్క క్యాచ్ వదిలేసినా.. సర్ఫరాజ్ ఖాన్ 50 ఓవర్ల పాటు బాగానే కీపింగ్ చేశాడు.
రెండు రోజుల ఈ వామప్ మ్యాచ్‌లో తొలి రోజు వర్షంతో తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. కాన్‌బెరాలో శనివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో టాస్ వేయడానికి కూడా కుదరలేదు. దాంతో అంపైర్లు తొలి రోజును ఆటను రద్దు చేశారు. రెండో రోజు అయిన ఆదివారం వర్షం లేకపోవడంతో 50 ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు అంగీకరించాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రధాని ఎలెవన్ 43.2 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ సామ్ కోన్‌స్టాస్(97 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్‌తో 107) సెంచరీతో రాణించగా.. టేయిలెండర్ హన్నో జకోబ్స్(60 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణాతో పాటు ఆకాశ్ దీప్(2/58) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి ఒక్క వికెట్ దక్కలేదు. ఈ సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేయలేదు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 90 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 75 పరుగులు జోడించారు. అనంతరం యశస్వి జైస్వాల్(59 బంతుల్లో 9 ఫోర్లతో 45) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగ్గా.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ(3) తీవ్రంగా నిరాశపరిచాడు. ప్రస్తుతం క్రీజులో నితీష్ కుమార్ రెడ్డితో పాటు శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
Rohit 😂🤌🏼#RohitSharma pic.twitter.com/VmxYZKdOrS
— Hrithik. . . 🌿 (@HRITHIKMR4) December 1, 2024