కొలంబో: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను వర్షం వెంటాడుతోంది. ఆసియాకప్ 2023లో భాగంగా జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌కు వర్షం మళ్లీ అంతరాయం కలిగించింది. దాంతో అంపైర్లు ఆటను నిలిపేయగా.. మైదానాన్ని కవర్లతో కప్పేసారు. ఇప్పటికే ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. సూపర్ 4 మ్యాచ్‌లో కూడా మళ్లీ అదే పరిస్థితి నెలకొంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 111 నాటౌట్), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 122 నాటౌట్) అజేయ సెంచరీలతో చెలరేగగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ(49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), శుభ్‌మన్ గిల్(52 బంతుల్లో 10 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు.

పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 11 ఓవర్లలో 2 వికెట్లకు 44 పరుగులు చేసింది. మరో 9 ఓవర్ల ఆట సాధ్యమైతేనే ఈ మ్యాచ్ ఫలితం తేలనుంది. లేకుంటే ఈ మ్యాచ్ కూడా రద్దవ్వనుంది. ప్రస్తుతం డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం టీమిండియాకు విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో పాకిస్థాన్ లక్ష్యాన్ని కుదించే అవకాశం ఉంది. 26 ఓవర్ల ఆట సాధ్యమైతే 244 పరుగులు.. 24 ఓవర్లకు కుదిస్తే 230 రన్స్, 22 ఓవర్లు అయితే 216 పరుగులు, 20 ఓవర్లు అయితే 200 పరుగులు పాకిస్థాన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 11 ఓవర్లు ఆడి 44 పరుగులే చేసిన పాక్.. మిగిలన ఓవర్లలో అంత భారీ లక్ష్యాన్ని అందుకోవడం చాలా కష్టం.
ఇక వర్షం దాగుడు మూతలు ఆడుతోంది. వస్తూ ఆగుతూ.. మైదాన సిబ్బంది సహనాన్ని పరీక్షిస్తోంది. కటాఫ్ టైమ్ 11 గంటలకు వేచి చూడనున్నారు. అప్పటికి మ్యాచ్ ఆడే ఆస్కారం లేకుంటే మ్యాచ్‌ను రద్దు చేస్తారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్‌డే అయిన నేటికి(సోమవారం) వాయిదా పడిన విషయం తెలిసిందే.