ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించాడు. ఆఖరి వరకు క్రీజులో నిల్చొని భారత విజయలాంఛనాన్ని పూర్తి చేసిన కోహ్లీ.. కీలక మ్యాచ్‌ల్లో రాణించే సత్తా ఇంకా తనలో ఉందని చాటి చెప్పాడు. కానీ ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ఫామ్ కనబర్చిన విరాట్ కోహ్లీని సెలెక్టర్లు అతని భవితవ్యంపై ప్రశ్నించినట్లు తాజాగా ఓ నివేదిక పేర్కొంది.
ఆసీస్ పర్యటనలో వరుసగా విఫలమవడంతో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేరుగా కోహ్లీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మెల్ బోర్న్ టెస్ట్ ఓటమి అనంతరమే కోహ్లీతో గవాస్కర్ చర్చించాడంట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సరిగ్గా ఈ ఘటనకు ముందే విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్ టెస్ట్ కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మ పేలవ ఫామ్ నేపథ్యంలో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాలని కోహ్లీని గంభీర్ కోరినట్లు ప్రచారం జరిగింది.

కోహ్లీ భవితవ్యంపై ప్రశ్నలు..
'ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ టెస్ట్‌లో టీమిండియా ఓడిన వెంటనే విరాట్ కోహ్లీని అజిత్ అగార్కర్ అతని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని అడిగాడు. ఆ సమయంలో టీమిండియా ఆఖరి టెస్ట్ అయిన సిడ్నీ మ్యాచ్ కోసం సన్నదమవుతోంది. కోహ్లీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చీఫ్ సెలెక్టర్ అగార్కర్ మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేశాడు.'అని ఓ క్రికెట్ బ్లాగర్ పేర్కొన్నాడు. కెప్టెన్సీ ఆఫర్‌తో పాటు అజిత్ అగార్కర్ ప్రశ్నలపై స్పందించని కోహ్లీ.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ బాది అందరి సందేహాలకు సమాధానమిచ్చాడు. 'భారత సెలెక్షన్ కమిటీ అడిగిన ప్రశ్నలకు కోహ్లీ తన బ్యాటింగ్‌తోనే సమాధానం ఇచ్చాడు.'అని సదరు బ్లాగర్ పేర్కొన్నాడు.

రోహిత్‌పై వేటు వేసింది గంభీరే..
ఈ నివేదిక జట్టులోని అనిశ్చితితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ భవితవ్యంపై జరగుతున్న చర్చను వెలుగులోకి తీసుకొచ్చింది. ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టు ప్రక్రియలో హెడ్ గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ ఫామ్‌పై తీవ్ర అసంతృప్తిగా ఉన్న అతను ఆఖరి టెస్ట్‌కు తుది జట్టు నుంచి తప్పించాడు. రోహిత్ శర్మ పీఆర్ టీమ్.. హిట్‌మ్యానే స్వయంగా తప్పుకున్నాడని ప్రచారం చేసినా.. అప్పటికే రోహిత్‌ను పక్కనపెట్టాలని గంభీర్ నిర్ణయించాడని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి.
సెంచరీతో బదులిచ్చిన కింగ్..
అంతర్జాతీయ టెస్ట్‌ల్లో రోహిత్ శర్మ కెరీర్ ముగిసిందని గంభీర్‌తో పాటు సెలెక్టర్లు భావిస్తున్నారని, కోహ్లీ జట్టులో దీర్ఘకాలిక సభ్యుడిగా కొనసాగాలానుకుంటున్నాడా? లేదా? అని తెలుసుకునేందుకు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని అగార్కర్ ప్రశ్నించారని ఈ నివేదిక పేర్కొంది. విరాట్ కోహ్లీ అద్భుతమైన శతకంతో తాను ఎంత గొప్ప ఆటగాడినో తెలియజేశాడు. అంతేకాకుండా తన కెరీర్ ఇంకా ముగియలేదనే స్పష్టమైన సందేశాన్ని సెలెక్టర్లకు ఇచ్చాడు.