కొలంబో: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో సెంచరీలతో చెలరేగిన కోహ్లీ.. రికార్డుల మోత మోగించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 13వేల పరుగుల మైలు రాయి అందుకున్న ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.
షాహిన్ అఫ్రిది వేసిన 48వ ఓవర్ రెండో బంతికి క్విక్ డబుల్ తీసిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 13వేల పరుగుల మైలు రాయి అందుకున్నాడు. ఆ మరుసటి బంతికే సింగిల్ తీసి వన్డేల్లో 47వ శతకాన్ని అందుకున్నాడు. వన్డేల్లో 13వేల పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు.

276 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ ఈ ఘనత అందుకోగా.. సచిన్ టెండూల్కర్ 321 ఇన్నింగ్స్‌లు, రికీ పాంటింగ్(341), కుమార సంగక్కర(363), సనత్ జయసూర్య(416) ఇన్నింగ్స్‌లు తర్వాతి స్థానంలో ఉన్నారు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్(18426) టాప్‌లో ఉండగా.. కుమార సంగక్కర(14,234), రికీ పాంటింగ్(13,704), సనత్ జయసూర్య(13,430) విరాట్ కోహ్లీ కన్నా ముందున్నారు.
ఈ ఏడాది కోహ్లీకి ఇది ఐదో అంతర్జాతీయ సెంచరీ. మూడు ఫార్మాట్లో కలిసి 21 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకోవడం విశేషం. శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది 34 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు బాదాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీబాదిన జాబితాలో కోహ్లీ.. సచిన్‌కు చేరువయ్యాడు. మరో మూడు శతకాలు బాదితే క్రికెట్ గాడ్‌ను వెనక్కినెట్టేస్తాడు.

కేఎల్ రాహుల్‌తో కలిసి విరాట్ కోహ్లీ మూడో వికెట్‌కు అజేయంగా 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆసియాకప్‌లోనే ఇది అత్యధిక భాగస్వామ్యం. కొలంబో వేదికగా విరాట్ కోహ్లీకి ఇది వరుసగా నాలుగో సెంచరీ కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 111 నాటౌట్), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 122 నాటౌట్) అజేయ సెంచరీలతో చెలరేగగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ(49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), శుభ్‌మన్ గిల్(52 బంతుల్లో 10 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఈ మ్యాచ్‌లో భారత టాప్-4 బ్యాటర్లు రాణించడం విశేషం. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసారు.