శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌ల సహకారంతోనే తాను సెంచరీ చేయగలిగానని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మైదానంలో ప్రేక్షకుల అరుపులను ఏ మాత్రం పట్టించుకోకుండా.. ఏకాగ్రత కోల్పోకుండా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించానన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏ నుంచి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన విరాట్ కోహ్లీ.. సహచర ఆటగాళ్లు అయిన శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. మిడిలార్డర్‌లో రిస్క్ లేకుండా స్పిన్నర్లను ఎదుర్కోవడమే తన బాధ్యత అని తెలిపాడు.

సంతోషంగా ఉంది..
'సెమీస్ క్వాలిఫై కావాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాణించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఆరంభంలోనే రోహిత్ ఔటైన వెంటనే వచ్చి రాణించడం మరింత ఆనందాన్నిచ్చింది. గత మ్యాచ్‌లో మనం ఏం నేర్చుకున్నామో అర్థం చేసుకోవాలి. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను ఎలాంటి రిస్కీ షాట్లు ఆడకుండా సమర్థవంతంగా ఎదుర్కోవడమే నా బాధ్యత. చివర్లో శ్రేయస్ అయ్యర్ ధాటిగా ఆడగా.. నేను కొన్ని బౌండరీలు బాదాను. ఈ మ్యాచ్ నాకు సాధారణ వన్డే గేమ్ ఆడేందుకు అనమతించింది.
నా ఆటపై నాకు సరైన అవగాహన ఉంది. ఔట్ సైడ్ లొల్లిని పట్టించుకోకుండా.. గతాన్ని లెక్క చేయకుండా నా స్పేస్‌లో ఉంటూ.. నా ఆలోచనలను నియంత్రించుకుంటూ బ్యాటింగ్ చేశాను. మైదానంలో ప్రతీ బంతికి 100 శాతం ఎఫర్ట్ ఇవ్వడమే కీలకంగా భావించాను. ఈ రోజు ఆ దేవుడు దయతలిచి సెంచరీ రూపంలో రివార్డ్ ఇచ్చాడు. పరుగులు ఎలా చేయాలనేదానిపై స్పష్టత ఉండటం ముఖ్యం. లేకుంటే స్పిన్నర్లు దెబ్బతీస్తారు.
గిల్, అయ్యర్ చెలరేగడంతో..
షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో శుభ్‌మన్ అద్భుతంగా ఆడాడు. అందుకే అతను వన్డేల్లోనే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఛేజింగ్ చేస్తున్నప్పుడు పవర్ ప్లేలో 60-70 పరుగులు చేయడం కీలకం. శ్రేయస్ అయ్యర్ కూడా నెంబర్ 4లో వచ్చి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. భారత్‌లో రాణించిన తరహాలోనే చెలరేగాడు. తదుపరి మ్యాచ్‌కు వారం రోజుల బ్రేక్ దొరకడం మంచిది. నిజాయితీగా చెప్పాలంటే 36 ఏళ్ల వయసులో ఉన్న నాకు ఈ మ్యాచ్ తరహా ప్రదర్శన చేయడానికి తగినంత విశ్రాంతి కావాలి.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(111 బంతుల్లో 7 ఫోర్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(67 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. శుభ్‌మన్ గిల్(52 బంతుల్లో 7 ఫోర్లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.