Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: విరాట్ కోహ్లీ శతకం.. పాక్‌పై టీమిండియా ఘన విజయం!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. గ్రూప్-ఏలో భాగంగా దాయాదీ పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బంతితో కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ శతక్కొట్టాడు. దాంతో హైఓల్టేజ్ మ్యాచ్ కాస్త ఏక పక్షంగా మారింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏ నుంచి టీమిండియా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు పాకిస్థాన్ సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. సౌద్ షకీల్(76 బంతుల్లో 5 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. మహమ్మద్ రిజ్వాన్(77 బంతుల్లో 3 ఫోర్లతో 46), కుష్దిల్ షా(39 బంతుల్లో 2 సిక్స్‌లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/40) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో వికెట్ తీసారు. హార్దిక్ పాండ్యా(2/31)కు రెండు వికెట్లు దక్కాయి.

IND vs PAK Virat Kohli Helps India Beat Pakistan In Champions Trophy 2025

శతక్కొట్టిన కోహ్లీ..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(111 బంతుల్లో 7 ఫోర్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(67 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. శుభ్‌మన్ గిల్(52 బంతుల్లో 7 ఫోర్లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(2/74) రెండు వికెట్లు తీయగా.. అబ్రర్ అహ్మద్, కుష్దీల్ షా తలో వికెట్ పడగొట్టారు.

రోహిత్ దూకుడు..
242 పరుగుల సాధారణ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించడం భారత్‌కు కలిసొచ్చింది. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న వికెట్‌పై హిట్ మ్యాన్ ఆరంభం నుంచే తనదైన శైలిలో చెలరేగాడు. క్రీజులో కాసేపే ఉన్నా.. ఓ భారీ సిక్సర్‌‌తో పాటు మూడు బౌండరీలు బాది భారత ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించాడు. పుల్ షాట్‌తో అతను కొట్టిన భారీ సిక్సర్‌ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20)ను షాహిన్ షా అఫ్రిది స్టన్నింగ్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు.

శుభ్‌మన్ గిల్ బాదుడు..
క్రీజులోకి విరాట్ కోహ్లీ రాగా.. శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడి ఒత్తిడిని తగ్గించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ తనదైన సింగిల్స్, క్విక్ డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేశాడు. హ్యారీస్ రౌఫ్ బౌలింగ్‌లో ట్రేడ్ మార్క్ బౌండరీలతో కోహ్లీ అంతర్జాతీయ వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన శుభ్‌మన్ గిల్‌‌ను అబ్రర్ అహ్మద్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

కోహ్లీ శతకం..
బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ ఆ తర్వాత బౌండరీలతో విరుచుకుపడింది. ఈ క్రమంలో కోహ్లీ 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరంభంలో తీవ్రంగా తడబడ్డ శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత స్విచ్ హిట్, స్వీప్, రివర్స్ స్వీప్‌లతో ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో అతను 63 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇమామ్ ఉల్ హక్ స్టన్నింగ్ క్యాచ్‌తో అతను వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 114 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా.. రెండు బౌండరీలు బాది కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ సింగిల్స్ తీస్తూ విరాట్ కోహ్లీ సెంచరీకి సహకరించాడు. బౌండరీ‌తో కోహ్లీ శతకంతో పాటు టీమిండియా విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. వన్డేల్లో విరాట్ కోహ్లీకి ఇది 51వ శతకం కాగా.. ఓవరాల్‌గా 82వ శతకం.

Story first published: Sunday, February 23, 2025, 21:50 [IST]
Other articles published on Feb 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+