టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. హ్యారిస్ రౌఫ్ వేసిన 13వ ఓవర్ రెండో బంతిని కోహ్లీ తన ట్రేడ్ మార్క్ కవర్ డ్రై షాట్‌తో బౌండరీ బాది ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డ్‌ను కోహ్లీ అధిగమించాడు.
తొలి బ్యాటర్‌గా..
సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్స్‌ల్లో 14వేల పరుగుల మైలురాయి అందుకుంటే కోహ్లీ 287 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. 378 ఇన్నింగ్స్‌ల్లో కుమార సంగక్కర ఈ మైలురాయిని అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 13000 పరుగుల నుంచి 14వేల పరుగులు ఫీట్ సాధించేందుకు కేవలం 10 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. సెప్టెంబర్ 2023లో ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లోనే కోహ్లీ 13 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు.
మళ్లీ అదే జట్టుపై 14వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ టెండూల్కర్(18426) టాప్‌లో ఉండగా.. కుమార సంగక్కర(14234), విరాట్ కోహ్లీ(14007*) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
India vs Pakistan Live స్కోరు కార్డు

అత్యధిక క్యాచ్‌లు..
అంతర్జాతీయ వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన క్రికెటర్‌గానూ కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు వన్డేల్లో విరాట్ కోహ్లీ 157 క్యాచ్ లు పట్టాడు. ఈ క్రమంలో మహ్మద్ అజారుద్దీన్(156) రికార్డును కోహ్లీ అధిగమించాడు. ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన మూడో క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే(218) ఉండగా.. రెండో స్థానంలో రికీ పాంటింగ్(160) ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్-5 ఆటగాళ్లలో భారత్ నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడే ఉండటం విశేషం.
భారత్ ఘన విజయం..
ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. సౌద్ షకీల్(76 బంతుల్లో 5 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. మహమ్మద్ రిజ్వాన్(77 బంతుల్లో 3 ఫోర్లతో 46), కుష్దిల్ షా(39 బంతుల్లో 2 సిక్స్‌లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/40) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో వికెట్ తీసారు. హార్దిక్ పాండ్యా(2/31)కు రెండు వికెట్లు దక్కాయి.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(111 బంతుల్లో 7 ఫోర్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(67 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. శుభ్‌మన్ గిల్(52 బంతుల్లో 7 ఫోర్లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(2/74) రెండు వికెట్లు తీయగా.. అబ్రర్ అహ్మద్, కుష్దీల్ షా తలో వికెట్ పడగొట్టారు.