కొలంబో: ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. వరల్డ్ బెస్ట్ పేస్ అటాక్‌ను సెంచరీలతో చీల్చి చెండాడారు. దాంతో పాక్ ముందు భారత్ 357 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. కేఎల్ రాహుల్(106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 111 నాటౌట్), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 122 నాటౌట్) అజేయ సెంచరీలతో చెలరేగడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసింది.
ఈ ఇద్దరికి తోడుగా ఓపెనర్లు రోహిత్ శర్మ(49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), శుభ్‌మన్ గిల్(52 బంతుల్లో 10 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ మ్యాచ్‌లో భారత టాప్-4 బ్యాటర్లు రాణించడం విశేషం. రాహుల్, కోహ్లీ మూడో వికెట్‌కు 233 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు.

అదిరిపోయే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. పాకిస్థాన్ బౌలర్లపై అటాకింగ్ గేమ్ ఆడిన ఈ జోడీ పవర్ ప్లేలో 61 పరుగులు చేసింది. అనంతరం ఇదే జోరు కొనసాగించగా.. 37 బంతుల్లో శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ వెంటనే రోహిత్ శర్మ కూడా 42 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు. 121 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని షాదాబ్ ఖాన్ విడదీసాడు. రోహిత్ శర్మను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

వర్షం ఇబ్బంది పెట్టినా..
ఆ మరుసటి ఓవర్‌లోనే శుభ్‌మన్ గిల్‌ను షాహిన్ అఫ్రిది ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో రిజర్వ్‌డేకు వాయిదా వేసారు. 147/2 స్కోర్‌తో రిజర్వ్ డే ఆటను కొనసాగించిన భారత్.. అదే జోరును కొనసాగించింది.
ఓవర్‌నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ సూపర్బ్ బ్యాటింగ్ చేశారు. ఆరంభంలో కాస్త సమయం తీసుకున్నా.. ఆ తర్వాత చూడ చక్కని షాట్లతో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 60 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ చేయగా.. విరాట్ కోహ్లీ 55 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ పోటాపడి బౌండరీలు బాదింది.

శతక్కొట్టిన రాహుల్, కోహ్లీ
నసీమ్ షా వేసిన 46వ ఓవర్‌లో క్విక్ డబుల్‌తో రాహుల్ 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుమారు 5 నెలల తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే రాహుల్ శతక్కొట్టి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. తన ఆటతోనే విమర్శకుల నోరు మూయించాడు. షాహిన్ అఫ్రిది వేసిన 48వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ క్విక్ డబుల్ తీసి వన్డేల్లో 13వేల పరుగుల మైలు రాయి అందుకున్నాడు.
ఆ వెంటనే సింగిల్‌తో వన్డేల్లో 47వ శతకాన్ని అందుకున్నాడు. ఫహీమ్ వేసిన ఆఖరి ఓవర్‌లో కోహ్లీ వినూత్న షాట్‌తో బౌండరీ రాబట్టాడు. అయితే ఈ బంతి నోబాల్ కావడంతో ఫ్రీహిట్ లభించింది. ఈ బంతిని కూడా కోహ్లీ బౌండరీ బాదాడు. ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచి భారత ఇన్నింగ్స్‌ను ముగించాడు.