టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా తమ జోరును కొనసాగిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విఫలమైనా.. కెప్టెన్ రోహిత్ శర్మ చేతులెత్తేసినా.. బౌలింగ్ సంచలన జస్‌ప్రీత్ బుమ్రా తన అసాధారణ బౌలింగ్‌తో టీమిండియాకు విజయాలను అందించాడు.
రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ అందుకున్నాడు. గత టీ20 ప్రపంచకప్ 2022లో మెల్ బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో పాకిస్థాన్‌ను ఓడిస్తే.. తాజా టోర్నీలో న్యూయార్క్ వేదికగా బుమ్రా భారత్‌ను గెలిపించాడు. ఆదివారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.

నిప్పులు చెరిగిన బుమ్రా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(31 బంతుల్లో 6 ఫోర్లతో 42), అక్షర్ పటేల్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20) మినహా అంతా విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా(3/21), హ్యారీస్ రౌఫ్(3/21) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ అమీర్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. షాహిన్ షా అఫ్రిది(2/29) ఒక వికెట్ తీసాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓటమిపాలైంది. మహమ్మద్ రిజ్వాన్(44 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 31) మినహా అంతా విఫలమయ్యారు. జస్‌ప్రీత్ బుమ్రా(3/14) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా(2/24) రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్(1/31), అక్షర్ పటేల్(1/11)తలో వికెట్ తీసారు.
మలుపు తిప్పిన రిజ్వాన్ వికెట్..
120 పరుగుల స్వల్ప లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్.. ఆచితూచిఆడింది. బాబర్ ఆజామ్, ఉస్మాన్ ఖాన్, ఫకార్ జమాన్ విఫలమైనా.. మహమ్మద్ రిజ్వాన్ ఒంటరి పోరాటం చేశాడు. టెస్ట్ తరహా బ్యాటింగ్‌తో లక్ష్యం దిశగా సాగాడు. దాంతో పాకిస్థాన్ 14 ఓవర్లలో 80 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి 30 బంతుల్లో 40 పరుగులు అవసరమయ్యాయి. హాఫ్ సెంచరీ దిశగా సాగిన మహమ్మద్ రిజ్వాన్ మ్యాచ్‌ను ముగిస్తాడని అంతా అనుకున్నారు.
కానీ బంతిని అందుకున్న బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో తొలి బంతికే రిజ్వాన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ బంతికి రిజ్వాన్ బిత్తరపోయాడు. ఈ వికెట్‌తో మ్యాచ్ భారత్‌వైపు మలుపు తిరిగింది. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు.
5 ఓవర్లలో ఒక్క బౌండరీ లేదు..
16వ ఓవర్‌లో అక్షర్ పటేల్ 2 పరుగులు ఇవ్వగా..17 ఓవర్‌లో హార్దిక్ పాండ్యా ఓ వికెట్ సాయంతో 5 పరుగులే ఇవ్వడంతో పాక్‌పై ఒత్తిడి పెరిగింది. 18వ ఓవర్‌లో సిరాజ్ ఓవైడ్, నోబాల్‌తో 9 పరుగులు ఇవ్వడంతో పాక్ శిభిరంలో ఆశలు రేకెత్తాయి. 19వ ఓవర్ వేసిన బుమ్రా 3 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీయడంతో భారత్ విజయం ఖాయమైంది.
15 నుంచి 19వ ఓవర్ వరకు భారత బౌలర్లు ఒక్క బౌండరీ ఇవ్వలేదు. చివరి ఓవర్‌లో పాక్ విజయానికి 18 పరుగులు అవసరమవ్వగా.. అర్ష్‌దీప్ సింగ్ ఓ వికెట్ సాయంతో 11 పరుగులే ఇచ్చి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. రిజ్వాన్‌ను బుమ్రా ఔట్ చేయకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.