
దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా భారత్‌తో జరుగుతున్న బిగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తేమ ప్రభావం ఉండనున్న నేపథ్యంలోనే ఫీల్డింగ్ ఎంచుకున్నానని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. అంతేకాకుండా ఆరంభంలోనే వికెట్లు తీసి భారత్‌పై ఆధిపత్యం చెలాయించాలనేది తమ ప్రణాళికని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ కోసం అన్ని విధాలుగా సిద్దమయ్యామని, నెట్స్‌లో తీవ్రంగా శ్రమించామన్నాడు. తాము ప్రకటించిన 12 మంది సభ్యులు గల జట్టులో హైదర్ అలీ బెంచ్‌కే పరిమితమయ్యాడన్నాడు.
ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, అయితే టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవాలనుకున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కానీ టాస్ గెలవడం మనచేతుల్లో లేదు కదా? అన్నాడు. తమ జట్టు సమతూకంగా ఉందని, ఈ బిగ్ మ్యాచ్ కోసం అన్ని విధాలుగా సిద్దమయ్యిందని చెప్పుకొచ్చాడు. ఈ బిగ్ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం చూస్తుందని తమకు తెలుసని, వారి అభిమానాన్ని మోటీవేషన్ తీసుకోవాలే తప్పా భావోద్వేగానికి గురవ్వవదన్నాడు. బయటి విషయాలు పట్టిచ్చుకోకుండా ఆటపైనే దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నాడు. కేవలం ప్రొఫెషనల్‌గా ఆడాలని అభిప్రాయపడ్డాడు. పిచ్‌పై గడ్డి లేదు కనుక మ్యాచ్ అసాంతం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నానన్నాడు. కాబట్టి పాక్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించాల్సి అవసరం ఉందని చెప్పాడు. ఇక రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్ ఆడటం లేదని కోహ్లీ స్పష్టం చేశాడు.
ఇక అనుభవం కలిగిన భువనేశ్వర్‌కు ఓటేసిన టీమిండియా మేనేజ్‌మెంట్.. యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీకి అవకాశం కల్పించింది. దాంతో శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ బెంచ్‌కే పరిమితమయ్యారు. అయితే రెండు వామప్ మ్యాచ్‌లు ఆడని వరుణ్‌ను తుది జట్టులో ఆడించడం గమనార్హం. తమ సస్పెన్స్ వెపన్‌గా వరుణ్‌ను టీమిండియా వాడుతోంది. మరీ ఈ వెపన్ సరిగ్గా పేలుతుందో లేదా మిస్ ఫైర్ అయితుందో చూడాలి.
చరిత్ర పరంగా చూసినా, ఆట పరంగా చూసినా ఐసీసీ మెగా ఈవెంట్లలో ఎప్పుడూ భారత్‌దే పైచేయి. అన్ని మెగా టోర్నీల్లో కలిపి ఇరుజట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరిగితే అన్నింటిలోనూ టీమిండియానే గెలిచింది. కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీసేననే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. 2007 టీ20 ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇరు జట్ల మధ్య జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారతే గెలవడం, ఇవన్నీ ధోనీ కెప్టెన్సీలో రావడం మరో విశేషం. ఇప్పుడు అదే ధోనీ మెంటార్‌గా రావడంతో జోష్, పోటీ రెట్టింపైంది. ఇరుజట్లు తమకు మరో మ్యాచ్ మాత్రమే అంటున్నా.. తెరవెనుక ఒత్తిడి మాత్రం ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో గెలుపు గీత దాటేదెవరో చూడాలి.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తీ, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా
పాకిస్థాన్: బాబర్ ఆజమ్(కెప్టెన్), రిజ్వాన్, ఫకర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, షాదాబ్, ఇమాద్ వసీమ్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షాహిన్ అఫ్రిది