
దుబాయ్: 1-1, 2-6, 3-31 పాకిస్థాన్ బిగ్ మ్యాచ్‌లో భారత్ పరిస్థితి. 100 పరుగులు చేయడం కష్టమేనని అంతా భావించారు. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(49 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 57) హాఫ్ సెంచరీతో ఆదుకోవడంతో దాయాదీ పాకిస్థాన్ ముందు భారత్ 152 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్‌కు.. రిషభ్ పంత్(30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) మెరుపులు తోడవడంతో భారత్ పోరాడే స్కోర్ చేయగలిగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది మూడు వికెట్లు తీయగా.. హసన్ అలీ, షాదాబ్ ఖాన్, హ్యారిస్ రౌఫ్ చెరొక వికెట్ తీశారు.
ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పాక్ యువపేసర్ షాహిన్ షా అఫ్రిది వేసిన ఫస్ట్ ఓవర్ నాలుగో బంతికి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో భారత్ 1 పరుగుకే ఓ వికెట్ కోల్పోయింది. క్రీజులోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ రాగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దాంతో అఫ్రిది వేసిన మూడో ఓవర్ ఫస్ట్ బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో భారత్ శిభిరంలో నిశబ్ధం ఆవహించింది. అయితే క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అదే ఓవర్ చివరి బంతిని సిక్స్‌గా మలిచి అందర్నీ సంతోషపరిచాడు. మరోవైపు కోహ్లీ నిదానంగా ఆడుతూ.. సూర్యను ధాటిగా ఆడించే ప్రయత్నం చేశాడు. అయితే షాహిన్ షా వేసిన ఐదో ఓవర్‌లో కోహ్లీ భారీ సిక్సర్ బాదాడు. కానీ హసన్ అలీ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఔటవ్వడంతో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బతగిలింది. దాంతో పవర్ ప్లేలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 36 పరుగులు మాత్రమే చేసింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్‌తో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో ఈ జోడీ ఆచితూచి ఆడింది. వీలు చిక్కిన బంతినే బౌండరీకి తరలించింది. దాంతో 10వ ఓవర్లలో భారత్ 3 వికెట్లకు 60 పరుగులు చేసింది. ఇక హసన్ అలీ వేసిన 12వ ఓవర్‌లో పంత్ తన విశ్వరూపాన్ని చూపించాడు. వరుసగా రెండు భారీ సిక్స్‌లు బాదాడు. ఈ రెండింటిని సింగిల్ హ్యాండ్‌తో కొట్టడం విశేషం. దాంతో ఆ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. అయితే అదే జోరులో ఆ మరుసటి ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
మరోవైపు కోహ్లీ మాత్రం తనదైన క్లాస్ బ్యాటింగ్‌ను కొనసాగించాడు. జడేజా సైతం అతనికి సహకరించడంతో స్కోర్ బోర్డు ముందుకు పరుగెత్తింది. ఈ క్రమంలోనే 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫోర్ బాది టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన జడేజా.. అదే జోరులో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక షాహిన్ షా అఫ్రిది వేసిన 18వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన కోహ్లీ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే హార్దిక్ పాండ్యా ఓ ఫోర్ బాదగా.. స్లో ఓవర్ రూపంలో భారత్ అప్పనంగా 5 రన్స్ రావడంతో ఈ ఓవర్‌లో మొత్తం 11 రన్స్ వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో హార్దిక్ ఔటవ్వగా.. భువనేశ్వర్ కుమార్ రెండు క్విక్ డబుల్స్‌తో పాటు ఓ సింగిల్ తీయడంతో భారత్ 151 పరుగుల మెరుగైన స్కోర్ చేయగలిగింది.