
నా కట్టే కాలేవరకు..
'ఆ ఓటమి వల్ల ఏర్పడిన బాధ ఇంకా ఉంది. నా కట్టే కాలేవరకు అది ఉండిపోతుంది. ఎందుకంటే అక్కడ గెలుపే ముఖ్యం. ఆ ఓటమితో నేను చాలా నిరుత్సాహానికి గురయ్యా. ఎందుకంటే ఫలితం దక్కనప్పుడు మనం పడిన కష్టమంతా వృథా అవుతుంది. నేను మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లాను. సునాయసంగా గెలిచే మ్యాచ్ చేజారడం చాలా బాధను మిగిల్చింది. జరిగిందేదో జరిగిందని మర్చిపోదామన్నా కుదరడం లేదు. నేను ఆ షాట్ ఆడి తప్పు చేశానని చాలా మంది అంటుంటారు. కానీ, అది నిజం కాదు. నేను ఇంతకు ముందెప్పుడూ పెడల్ స్వీప్ షాట్ ఆడి ఔట్ కాలేదు. అది నా ఫేవరెట్ షాట్.

డ్రా చేద్దామని..
ఫీల్డర్ ఫైన్ లెగ్ కంటే వెనకుంటే ఆ షాట్‌తో నాకు సింగిల్ వచ్చేది. ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లో కూడా నేను అదే షాట్ కొట్టాను. స్కోర్ సమం చేయాలనుకున్నాను. అందుకే వికెట్ కీపర్‌పై నుంచి ఫోర్ కొట్టాలని భావించా. వాళ్లు ఫీల్డర్‌ను వెనక పెట్టుంటే, నేను సింగిల్ తీసుండేవాడిని. దగ్గరగా పెట్టడంతో అతని పైనుంచి కొట్టాలనుకున్నా. కానీ, ఆ పెడల్ స్వీప్ షాట్ మిస్ ఫైర్ అయింది. ఔటవ్వగానే నా ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. నేను ఆడే బెస్ట్ షాట్ అదేనని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. కానీ, ఆ సమయంలో సక్సెస్ కాలేదు.

నేను ఔటైందే గుర్తొస్తుంది..
ఆ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటే.. అందరికీ నేను ఔటైన క్షణం, ఆ చివరి ఓవరే గుర్తొస్తుంది. కానీ, ఈ మ్యాచ్‌లో ముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇమ్రాన్ నజీర్ రనౌట్ అయ్యాడు. తను 14 బంతుల్లోనే 33 రన్స్ చేశాడు. అంతకు ముందు సెమీ ఫైనల్లో తను వేగంగా అర్థసెంచరీ చేశాడు. వరుసగా వికెట్లు పడుతూ వచ్చాయి. మొదటి బంతికే షాహిద్ అఫ్రిదీ ఔటయ్యాడు. సోహెల్ తన్వీర్ రెండు సిక్సర్లు కొట్టాక బౌల్డ్ అయ్యాడు. అయినా మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లా. చివరి ఓవర్లో కూడా 13 రన్స్ చేయగలననే నమ్మకంతో ఉన్నా. అయితే ఆ బంతిని చాలా దగ్గరగా ఆడటంతో దూరంగా వెళ్లకుండా గాల్లోకి లేచింది.

ఆ మాట ఎప్పటికీ మర్చిపోను..
నేను ఔటైన తర్వాత నాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోవడంతో జట్టు మొత్తం బాధ పడింది. ఇంత దగ్గరగా వచ్చి కూడా గెలవలేకపోయామే అని నేను అందరికంటే ఎక్కువ బాధపడ్డా. రెండేళ్ల తర్వాత జరిగిన 2009 టీ-20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆడుతున్నప్పుడు విన్నింగ్ షాట్ కొట్టే సమయం వచ్చింది. నేను లోయరార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఉన్నా.
అప్పటి కెప్టెన్ యూనిస్ ఖాన్ నన్ను పాడ్స్ కట్టుకోమన్నారు. నేను వెళ్లాలనుకోలేదు. కానీ, రెండేళ్ల క్రితం ఫైనల్లో విన్నింగ్ షాట్ కొట్టలేకపోయిన విషయం యూనిస్ ఖాన్‌కు గుర్తుంది. అందుకే అప్పుడు ఆయన ఆ అవకాశం నాకివ్వాలనుకున్నారు. షాహిద్ అఫ్రిది, షోయబ్ మలిక్ ఆ మ్యాచ్ గెలిపించడంతో నాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ నేను యూనిస్ ఖాన్ మాటను ఎప్పటికీ మర్చిపోలేను'అని మిస్బా-ఉల్-హక్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












