పల్లెకెలె: 'క్లాస్‌లో ఎవడైనా ఆన్సర్ చెబుతాడు సర్. కానీ పరీక్షల్లో రాసినోడే టాపర్ అవుతాడు' జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్.. ఇది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచకప్ ఫైనల్ కంటే ఎక్కువ భావించే అసలు సిసలు భారత్-పాక్ మ్యాచ్‌లో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు.
పాకిస్థాన్ సెన్సేషన్ షాహిన్ షా అఫ్రిది ధాటికి వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. ముందుగా రోహిత్ శర్మ... షాహిన్ షా అఫ్రిది ఇన్‌స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అవ్వగా.. కోహ్లీ ఔట్ స్వింగర్‌ను ఆడబోయి బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. ఈ ఇద్దరూ మరోసారి తమ స్వింగ్ బౌలింగ్ బలహీనతను బయటపెట్టుకున్నారు.

పట్టుమని పది ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయకుండా ఇద్దరూ పెవిలియన్ చేరడంతో టీమిండియా తీవ్ర కష్టాల్లో పడటంతో ఒత్తిడిలో కూరుకుపోయింది. కీలక మ్యాచ్‌లో బాధ్యతా రహితంగా ఆడి వికెట్లు పారేసుకున్న ఈ ఇద్దరిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
రోహిత్ శర్మ వడపావ్ తినడానికి త్వరగా ఔటయ్యాడని ఒకరంటే.. తన చెత్త బ్యాటింగ్‌తో జట్టును నట్టేట ముంచేసాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ ఇలా ఆడుతాడని అస్సలు ఊహించలేదని, తన ఆటతో తీవ్రంగా హర్ట్ అయ్యామని కామెంట్ చేస్తున్నారు. అసలు షాహిన్ షా అఫ్రిది బౌలింగ్‌పై హోమ్ వర్క్ చేయలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రాక్టీస్ క్యాంప్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ ఏం చేసిందని నిలదీస్తున్నారు.
రోహిత్ ఔటైన తర్వాత కనీసం కోహ్లీ అయిన ఆడుతాడని భావిస్తే అతను కూడా తమని తీవ్రంగా నిరాశపరిచాడని మండిపడుతున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మలకు వయసు పై బడిందని, ఈ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమమని కామెంట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ స్థానంలో ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ స్థానంలో తిలక్ వర్మను ఆడించడం ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా షాహిన్ అఫ్రిది, హ్యారీస్ రౌఫ్ నిప్పులు చెరగడంతో 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. 20 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్లకు 102 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(11), విరాట్ కోహ్లీ(4), శ్రేయస్ అయ్యర్(14), శుభ్‌మన్ గిల్(10) దారుణంగా విఫలమయ్యారు.