టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పాకిస్థాన్ స్టార్ పేసర్ మహమ్మద్ అమీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. హిట్ మ్యాన్ అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ అని కొనియాడిన అమీర్.. క్రీజులో సెట్ అయితే ఔట్ చేయడం చాలా కష్టమని తెలిపాడు. బంతి కొత్తగా ఉన్నప్పుడే ఇన్నింగ్స్ ఆరంభంలోనే రోహిత్ శర్మ ప్యాడ్స్‌ను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేస్తేనే ఔట్ చేయగలమని అభిప్రాయపడ్డాడు.
అలా కాకుండా రోహిత్ శర్మ 15-20 బంతులు ఆడితే ఏ బౌలర్ కూడా అతన్ని ఇబ్బంది పెట్టలేరని స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఆదివారం హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. సుదీర్ఘ విరామం తర్వాత రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకొని పాకిస్థాన్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన మహమ్మద్ అమీర్.. బిగ్ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడాడు.

రోహిత్ శర్మ బలం, బలహీనత తనకు బాగా తెలుసని చెప్పాడు. 'రోహిత్ శర్మ ఓ వరల్డ్ క్లాస్ ప్లేయర్. అతను ఒక్కసారి సెట్ అయితే ప్రమాదకరంగా మారిపోతాడు. ఏ బౌలర్‌ను కూడా వదలుకుండా చెలరేగుతాడు. ఆరంభంలోనే అతన్ని ఔట్ చేసే ప్రయత్నం చేయాలి. కొత్త బంతితోనే నిలకడగా అతని ప్యాడ్స్‌పై హిట్ చేయాలి. అప్పుడే రోహిత్ ఔటవుతాడు. గతంలో నేను ఇలానే రోహిత్ శర్మను ఔట్ చేశాను. అలా కాకుండా హిట్ మ్యాన్ 15-20 బంతులు ఎదుర్కొంటే బౌలర్లకు తన విశ్వరూపం చూపిస్తాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు.
2019 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు కఠినంగా ఉన్నా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తీవ్రంగా ఇబ్బంది పడినా.. రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతని కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రాణించకుంటే ఫలితం మరోలా ఉండేది.
ఈ మ్యాచ్ ఛేజింగ్‌లో కుల్దీప్ యాదవ్ పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు. బాబర్ ఆజామ్, ఫకార్ జమాన్ అద్భుత భాగస్వామ్యాన్ని విడదీయడంతో పాటు ఇద్దర్నీ ఔట్ చేశాడు. ఇదే మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పింది.'అని మహమ్మద్ అమీర్ గుర్తు చేసుకున్నాడు.
భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఆడాలంటే అంత సులువైన పనికాదన్న అమీర్.. చాతా ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. కానీ అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజా దక్కుతుందని తెలిపాడు.