కొలంబో: ఆసియాకప్ 2023లో టీమిండియా తన జోరును కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 229 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించినా.. రిజర్వ్ డే సాయంతో పూర్తి మ్యాచ్ సాధ్యం కాగా.. భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
భారత టాప్-4 బ్యాటర్లు దుమ్మురేపడంతో పాకిస్థాన్ కనీస పోరాటం చేయలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 111 నాటౌట్), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 122 నాటౌట్) అజేయ సెంచరీలతో చెలరేగగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ(49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), శుభ్‌మన్ గిల్(52 బంతుల్లో 10 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు.

పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 32 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులు చేసి ఓటమికి అంగీకరించింది. నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్ గాయపడటంతో బ్యాటింగ్‌కు రాలేదు. దాంతో భారత్ విజయం లాంఛనమైంది.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(5/25) ఐదు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. భారీ లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్..భారత బౌలర్ల ధాటికి విల విలలాడింది. ఇమామ్ ఉల్ హక్(9), బాబర్ ఆజామ్(10), మహమ్మద్ రిజ్వాన్(2), ఫకార్ జమాన్(27), అఘా సల్మాన్(23), షాదాబ్ ఖాన్(6), ఇఫ్తికర్ అహ్మద్(23), ఫహీమ్(4) దారుణంగా విఫలమయ్యారు.
షాహిన్ షా అఫ్రిది(7 నాటౌట్) అజేయంగా నిలవగా.. నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్ బ్యాటింగ్‌కు రాలేదు. భారత ఇన్నింగ్స్ సందర్భంగా బౌలింగ్ చేస్తుండగా ఈ ఇద్దరూ గాయపడ్డారు. ముందస్తు చర్యల్లో భాగంగా బ్యాటింగ్ చేయలేదు. దాంతో భారత విజయం లాంఛనమైంది.