హైదరాబాద్: భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత ఆ స్థాయి ప్రాధాన్యత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు దక్కుతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. రోహిత్ శర్మలా డబుల్ సెంచరీలు బాదకపోయినా.. కోహ్లీలా సెంచరీల మోత మోగించకపోయినా.. రాహుల్‌కు జట్టులో వారి స్థాయి గౌరవం దక్కుతుంది.
టీమిండియాకు గుర్తుండిపోయే విజయాలు అందించకపోయినా.. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నా.. తుది జట్టులో అతనికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అతని కోసం ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను కూడా పక్కనపెడతారు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు రాహుల్‌కు రక్షణగా నిలిచాడు. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు అందుబాటులో ఉన్నప్పుడు మిడిలార్డర్‌లో ఆడించారు.

ఈ ఇద్దరిలో ఒకరు అందుబాటులో లేనప్పుడు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చారు. గాయాలతో జట్టుకు దూరమైందే తప్పా.. అతన్ని ఏనాడు పక్కన పెట్టలేదు. చివరకు వికెట్ కీపర్‌గా అవకాశం ఇచ్చి ప్రధాన వికెట్ కీపర్ అయిన రిషభ్ పంత్‌ను కూడా బెంచ్‌పై కూర్చోబెట్టారు. రాహుల్ కూడా కొన్ని మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. అయితే టీమిండియాకు అవసరమైన ప్రతీసారి అతను విఫలమయ్యాడు.
రాహుల్ చాలా టాలెంటెడ్ ప్లేయర్. క్లాస్ ఆటగాడు. టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తర్వాత ఆ స్థాయిలో టెస్ట్ బుక్ షాట్స్ ఆడే ఏకైక ప్లేయర్ కేఎల్ రాహుల్ మాత్రమే. అయితే అతను ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేడనేది కూడా అంతే వాస్తవం. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్, 2022 టీ20 ప్రపంచకప్‌ల్లో అతని వైఫల్యాన్ని చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది.

ఈ నాలుగు టోర్నీల్లో ఓపెనర్‌గా విఫలమైన రాహుల్‌ను ఇప్పుడు మిడిలార్డర్‌లో ఆడించేందుకు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సిద్దమైంది. తొడ కండరాల గాయంతో గత నాలుగు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నా.. ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా ఒక్క వన్డే ఆడకపోయినా.. ఆసియాకప్‌తో పాటు వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక చేసింది.
అంతేకాకుండా తమ ప్రధాన వికెట్ కీపర్ అతనే అని ప్రకటించింది. ఆసియాకప్‌కు పూర్తి ఫిట్‌గా లేకపోయినా.. జట్టులోకి తీసుకొని ఫిట్ అయ్యే వరకు వేచి చూసింది. రాహుల్ ప్లేస్‌లో మరే ఆటగాడున్నా.. అతని కెరీర్ ఎప్పుడో ముగిసిపోయేది. అసలు రాహుల్‌కు ఎందుకంత ప్రాధాన్యత అనేది సగటు అభిమానికి అంతు పట్టని విషయం.
ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో రాహుల్ కోసం మరో ప్లేయర్‌ను బలి చేసేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ సిద్దమవుతోంది. వన్డే ప్రపంచకప్ టీమ్ ప్రకటన సమయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. రాహుల్ కోసం సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను పక్కనపెడతారా? అనే ప్రశ్నకు.. ఇద్దరు తుది జట్టులో ఉంటే ఏదైనా సమస్యా? అని అగార్కర్ ఎదురు ప్రశ్నించాడు.

ఈ వ్యాఖ్యలు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ తుది జట్టులో ఉంటారనే సంకేతాలిచ్చాయి. రాహుల్ కోసం బలయ్యే ఆటగాడు ఎవరా? అంటే టీమ్‌మేనేజ్‌మెంట్ ముందున్న ఏకైక ఆప్షన్ శ్రేయస్ అయ్యర్. రాహుల్‌లానే గాయం నుంచి తిరిగొచ్చిన అయ్యర్‌ను అతని కోసం బలిపశువును చేయనున్నారు. ఆసియాకప్‌లో ఇషాన్ కిషన్ నిలకడగా రాణించకుంటే అతన్ని పక్కనపెట్టి అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నారు.