పల్లెకెలె: టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్ జరిగిన మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్ చెలరేగిన ఇషాన్ కిషన్(81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 82).. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు బద్దలు కొట్టాడు.
ఆసియాకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో ధోనీని అధిగమించాడు. 2008 ఆసియాకప్‌లో పాకిస్థాన్‌పై ధోనీ 76 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే టాప్‌లో ఉండగా ఇషన్ కిషన్ అధిగమించాడు. ఈ జాబితాలో ఇషాన్ కిషన్(82), ధోనీ(76), ఎస్‌సీ ఖన్నా(56) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆసియాకప్ చరిత్రలో ఓ వికెట్ కీపర్ 50 ప్లస్ రన్స్ చేయడం ఇది నాలుగోసారి మాత్రమే.

ఇక వన్డే ఫార్మాట్‌లో ఇషాన్ కిషాన్‌కు ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో భారత వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ గుర్తింపు పొందాడు. పాకిస్థాన్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 50 ప్లస్ రన్స్ చేసిన రెండో భారత లెఫ్టాండర్‌గా నిలిచాడు. భారత్ తరఫున వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, శ్రేయస్ అయ్యర్, సురేశ్ రైనా, మహమ్మద్ అజారుద్దీన్‌ల సరసన ఇషాన్ కిషన్ నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో 66 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును.. ఇషాన్ కిషన్ సూపర్ బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు.
హార్దిక్ పాండ్యా(90 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 87)తో కలిసి ఐదో వికెట్‌కు 138 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో266 పరుగులకు కుప్పకూలింది.
పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది నాలుగు వికెట్లు తీయగా.. హ్యారీస్ రౌఫ్, నసీమ్ షా మూడేసి వికెట్లు తీసారు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి మెచ్యూర్‌గా బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్.. తనదైన షాట్లతో పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో 54 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అనంతరం సెంచరీ దిశగా సాగిన అతని ఇన్నింగ్స్‌కు హ్యారీస్ రౌఫ్ బ్రేక్ వేసాడు. ఊరించే బౌన్సర్‌తో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.