అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు దుమ్మురేపారు. జస్‌ప్రీత్ బుమ్రా(2/19), మహమ్మద్ సిరాజ్(2/50), హార్దిక్ పాండ్యా(2/34), కుల్దీప్ యాదవ్(2/35), రవీంద్ర జడేజా(2/38) రెండేసి వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించారు.
భారత బౌలర్ల ధాటికి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(58 బంతుల్లో 7 ఫోర్లతో 50), మహమ్మద్ రిజ్వాన్(69 బంతుల్లో 7 ఫోర్లతో 49) మినహా అంతా విఫలమయ్యారు. రెండు ఓవర్లు వేసిన శార్దూల్ ఠాకూర్ మినహా అందరూ వికెట్ తీయడం విశేషం.

ఓ దశలో 155/2 స్కోర్‌తో భారీ స్కోర్ చేసేలా కనిపించిన పాకిస్థాన్ 36 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లు కోల్పోయింది. 82 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన బాబర్ ఆజామ్(50), మహమ్మద్ రిజ్వాన్(49)జోడీని సిరాజ్ స్టన్నింగ్ డెలివరీతో విడదీయగా.. కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా డబుల్ స్ట్రోక్‌తో పాకిస్థాన్ పతనాన్ని శాసించారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ రివ్యూతోనే ఈ మ్యాచ్ మలుపు తిరిగింది.
ఆరంభం దక్కినా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్(20), ఇమామ్ ఉల్ హక్(36) శుభారంభమే అందించారు. సిరాజ్‌పై ఎదురు దాడికి దిగిన ఈ జోడీ.. వేగంగా పరుగులు రాబట్టింది. వికెట్ బౌలింగ్‌కు అనుకూలంగా లేదని భావించిన సిరాజ్.. సీనియర్ల సూచనతో తన వ్యూహాన్ని మార్చాడు. అబ్దుల్లాను క్రాస్ సీమ్ డెలివరీతో పెవిలియన్ చేర్చి భారత్‌కు శుభారంభాన్నిఅందించాడు.
బాబర్ ఆదుకున్నా..
క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజామ్ ఆచితూచి ఆడటంతో పాకిస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. ధాటిగా ఆడుతున్న ఇమామ్ ఉల్ హక్‌ను హార్దిక్ పాండ్యా తన మంత్రంతో పెవిలియన్ చేర్చాడు. బంతికి ఏదో మంత్ర వేసి బౌలింగ్ చేయగా.. ఇమామ్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో బాబర్ ఆజామ్, రిజ్వాన్ జట్టును ఆదుకున్నారు.
మలుపు తిప్పిన సిరాజ్..
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బాబర్ ఆజామ్‌ను సంచలన బౌలింగ్‌తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో పాక్ పతనం మొదలైంది. ఒకే ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ సౌద్ షకీల్, ఇఫ్తికర్‌ను ఔట్ చేయగా.. జస్‌ప్రీత్ బుమ్రా వరుస ఓవర్లలో మహమ్మద్ రిజ్వాన్, షాదాబ్ ఖాన్‌లను పెవిలియన్ చేర్చాడు. హమ్మద్ నవాజ్(4)ను హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్ చేయగా.. హాసన్ అలీ, హ్యారీస్ రౌఫ్‌లను జడేజా ఔట్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ ముగిసింది.