మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా బోణీ కొట్టింది. దాయాదీ పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్.. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటి పాక్‌ను స్వల్ప స్కోర్‌కు పరిమితం చేసిన హర్మన్ సేన.. ఆ తర్వాత పిచ్ తగ్గట్లు బ్యాటింగ్ చేసి విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 105 పరుగులే చేసింది. నిదా దార్(34 బంతుల్లో ఫోర్‌తో 28) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో తెలుగు తేజం అరుందతి రెడ్డి(3/19) మూడు వికెట్లతో సత్తా చాటగా.. రేణుక సింగ్, దీప్తి శర్మ తలో వికెట్ తీసారు. శ్రేయాంక పాటిల్‌కు రెండు వికెట్లు దక్కాయి.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 108 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(7) విఫలమైనా.. షెఫాలీ వర్మ(35 బంతుల్లో 3 ఫోర్లతో 32), జెమీమా రోడ్రిగ్స్(28 బంతుల్లో 23), హర్మన్‌ప్రీత్ కౌర్(24 బంతుల్లో ఫోర్‌తో 29) ఆచితూచి ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
హర్మన్‌ప్రీత్ కౌర్ గాయంతో రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరగ్గా.. రిచా ఘోష్(0) గోల్డెన్ డకౌట్ అయింది. క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(7 నాటౌట్), సజీవన్ సజన(4 నాటౌట్) ఎలాంటి తప్పిదం చేయకుండా విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో ఫతిమా సనా(2/23) రెండు వికెట్లు తీయగా.. సదియా ఇక్బాల్, ఓమైమా సోహైల్ తలో వికెట్ తీసారు. బౌలింగ్‌లో మూడు వికెట్లతో సత్తా చాటిన తెలుగు తేజం అరుందతి రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.