పల్లెకెలె: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అభిమానులు మండిపడుతున్నారు. ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగగా.. తుది జట్టులో వెటరన్ పేసర్ మహమ్మద్ షమీకి అవకాశం ఇవ్వలేదు.
అతనికి బదులు బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్‌ను తీసుకున్నారు. అయితే షమీని తీసుకోకపోవడం తెలివి తక్కువ నిర్ణయమని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఏ లెక్కన చూసుకున్న షమీకి బదులు శార్దూల్‌ను తీసుకోవాల్సింది కాదని అభిప్రాయపడుతున్నారు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై మహమ్మద్ షమీకి మంచి రికార్డు ఉందని, అతను జట్టులో ఉండి ఉంటే షమీ ఇబ్బంది పడేవాడని అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ కామెంటేర్ సంజయ్ మంజ్రేకర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. శార్దూల్ ఠాకూర్ కంటే మహమ్మద్ షమీ పాకిస్థాన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవాడని తెలిపాడు.
బ్యాటింగ్ డెప్త్ కోసం చూసిన టీమిండియా.. బౌలింగ్ డెప్త్ చూసుకోకపోవడం విడ్డూరమని అభిప్రాయపడ్డాడు. లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో షమీ కీలకమవుతాడని జోస్యం చెప్పాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ షమీకి బదులు భువనేశ్వర్ కుమార్‌ను తీసుకొని మూల్యం చెల్లించుకున్నారని, మరోసారి అదే తరహా తప్పిదం చేశారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అండర్ లైట్స్ కింద కొత్త బంతితో షమీ అసాధారణ బౌలింగ్ చేస్తాడని, అతన్ని ఈ మ్యాచ్‌లో టీమిండియా కచ్చితంగా మిస్సవుతుందని అభిప్రాయపడుతున్నారు. కొందరైతే శార్దూల్ ఠాకూర్ ఆడటం వల్ల జట్టుకు ఒరిగేదేం ఉందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం శార్దూల్ ఠాకూర్‌కు అండగా నిలుస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ 2022తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్లో షమీ విఫలమయ్యాడని, అతను సరైన ఫామ్‌లో లేడనే విషయాన్ని అందరూ గుర్తించాలని కోరుతున్నారు. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ ఆగి పోయే సమయానికి టీమిండియా 4.2 ఓవర్లలో 15 పరుగులు చేసింది.