ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శనతో టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తీవ్ర ఒత్తిడిలో అసాధారణ ప్రదర్శనతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్నందించిన తిలక్ వర్మ.. అభిమానులకు సూపర్ హీరోగా మారిపోయాడు. ఇప్పటికే తిలక్ వర్మను విరాట్ కోహ్లీతో పోల్చుతూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు.
అయితే తాజాగా తిలక్ వర్మకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తిలక్ వర్మ బ్యాటింగ్‌కు పాకిస్థాన్‌లోని యువతులు ఎగిరి గంతేసారు. పాకిస్థాన్ ఓడినప్పటికీ.. 'తిలక్.. జైమాతా దీ'అంటూ సంబరాలు చేస్తున్నారు. భారత జట్టుకు విజయ తిలకం దిద్దాడని, తగ్గేదేలే అని సైగలు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. భారత్, పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసిన కొందురు పాక్ యువతులు.. భారత విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. విరాట్ కోహ్లీ తర్వాత పాకిస్థాన్‌లో అభిమానులను సొంతం చేసుకున్న ఆటగాడు తిలక్ వర్మ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

గత ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్వదేశం చేరుకున్న తిలక్ వర్మ మంగళవారం హైదరాబాద్‌లో సందడి చేశాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తిలక్ వర్మ ఫైనల్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'ఫైనల్లో నేను క్రీజులోకి వచ్చే సమయానికి మూడు వికెట్లు పడ్డాయి. తీవ్ర ఒత్తిడి ఉంది. ఆ సమయంలో పాకిస్థాన్ ఆటగాళ్లు సూటి పోటీ మాటలతో కవ్వింపులకు పాల్పడ్డారు. ముఖ్యంగా పాకిస్థాన్ వికెట్ కీపర మహమ్మద్ హరిస్ వెనుకాల నుంచి స్లెడ్జింగ్‌కు దిగాడు. ఇది ఐపీఎల్ కాదని, ముంబై కాదని ఎద్దేవా చేశాడు.
ఆ మాటలకు కోపం వచ్చింది. కానీ ఆ సమయంలో నాకు దేశమే గుర్తొచ్చింది. ఓడితే దేశం తక్కువ అవుతుందని నన్ను నేను బ్యాక్ చేసుకున్నాను. వారి మాటలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నా. అనుకున్నట్లుగానే చెలరేగిపోయా. స్టేడియంలో అభిమానులు వందేమాతరంతో హోరెత్తించడంతో మరింత కసిగా చెలరేగిపోయా. నా ఆట తర్వాత మైదానంలో పాకిస్థాన్ ఆటగాళ్లు ఎవరూ కనిపించలేదు. మరో మాట అనే అవకాశం వారికి లేకుండా పోయింది. నేను ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఇదే అత్యుత్తమైన ఇన్నింగ్స్.
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకస్థాన్ ఆటగాళ్లు కొంత దూకుడుగా వచ్చారు. క్రీడలను ఎమోషన్స్‌తో ఆడితే కష్టం. ఆటను ఆటలా ఆడి వారికి మంచి రిప్లె ఇచ్చాం. చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆటను చూస్తూ పెరిగాను. అతనితో నన్ను పోల్చడం గర్వంగా ఉంది. వచ్చే ప్రపంచకప్‌లో భారత్‌ను గెలిపించడమే నా లక్ష్యం. 'అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.