టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి సహనం కోల్పోయాడు. తన బౌలింగ్‌లో క్యాచ్‌లు వదిలేసిన సహచర ఆటగాళ్లపై నోరుపారేసుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
పాకిస్థాన్ ఇన్నింగ్స్ సందర్భంగా హార్దిక్ పాండ్యా వేసిన 18వ ఓవర్‌లో షాహిన్ అఫ్రిది ఇచ్చిన రెండు క్యాచ్‌లను ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ వరుసగా వదిలేసారు. ఈ ఓవర్ తొలి బంతి షాహిన్ అఫ్రిది గ్లోవ్స్ తాకుతూ కీపర్ వైపు వెళ్లగా ఇషాన్ అందుకోలేకపోయాడు. ఆ మరుసటి బంతినే షాహిన్ అఫ్రిది భారీ షాట్ ఆడగా.. లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్ చేతిలో పడి బంతి బౌండరీ బయట పడింది.
క్యాచ్ వదిలేయడంతో పాటు కుల్దీప్ సిక్సర్‌ను కూడా అడ్డుకోలేకపోయాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన హార్దిక్ పాండ్యా.. ముందు వాడు.. ఇప్పుడు నువ్వు.. ఏడ మోపైర్రా నాకు అని అసహనం వ్యక్తం చేశాడు. ఇదే ఓవర్ అఖరి బంతికి ఉస్మాన్ తారిక్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన హార్దిక్ భారత విజయాలాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఈ మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్‌ను హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ మందలించాడు. ఈజీ క్యాచ్ పట్టకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా కుల్దీప్ యాదవ్ లాంగాన్‌లో ఫీల్డింగ్ చేయడు. కానీ అప్పటికే భారత విజయం లాంఛనం కావడంతో ప్రాక్టీస్ కోసం అతన్ని లాంగాన్‌లో ఉంచారు. కానీ అతను సునాయస క్యాచ్‌ను నేలపాలు చేయడంతో పాటు సిక్సర్‌ను అడ్డుకోలేకపోయాడు. భారత్ విజయం ఖాయమైంది కాబట్టి ఎలాంటి నష్టం జరగ లేదు. కానీ కీలక మ్యాచ్‌ల్లో ఇలాంటి ఈజీ క్యాచ్‌లు వదిలేస్తే ఎలా? అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుల్దీప్ యాదవ్ ఫీల్డింగ్‌లో వీక్ అనే సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే గతంలో రోహిత్ శర్మ చేతిలో కూడా అతను తిట్లు తిన్నాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్-8 బెర్త్ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో 3 ఫోర్లతో 32), శివమ్ దూబే(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27) విలువైన పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్(3/25) మూడు వికెట్లు తీయగా.. ఉస్మాన్ తారిక్(1/24), సల్మాన్ అఘా, షాహిన్ షా అఫ్రిదిలకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 44) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/17), అక్షర్ పటేల్(2/29), వరుణ్ చక్రవర్తీ(2/17), హార్దిక్ పాండ్యా(2/16) రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో టీమిండియా సూపర్-8 బెర్త్ దక్కించుకుంది. నెదర్లాండ్స్‌తో బుధవారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.