ఇండియా వర్సెస్ న్యూజిలాండ్: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ రోహిత్ సేన విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
గత 20 ఏళ్లుగా వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాలకు చెక్ పెట్టడంతో పాటు 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 2003 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా న్యూజిలాండ్‌పై గెలిచిన టీమిండియా.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు కుప్పకూలింది. డారిల్ మిచెల్(127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 130), రచిన్ రవీంద్ర(87 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 75) రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(5/54) ఐదు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. కుల్దీప్ యాదవ్(2/73) రెండు వికెట్లు తీయగా.. బుమ్రా(1/45), సిరాజ్(1/45) తలో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(104 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 95) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. రోహిత్ శర్మ(40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46), రవీంద్ర జడేజా(44 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 39 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
రోహిత్ విధ్వంసం..:274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(46), శుభ్‌మన్ గిల్(26) అదిరిపోయే ఆరంభాన్నిఅందించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ తన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో టీమిండియా పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్ శర్మను ఫెర్గూసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
దాంతో తొలి వికెట్‌కు నమోదైన 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఫెర్గూసన్ మరుసటి ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్.. విరాట్ కోహ్లీతో కలిసి ధాటిగా ఆడాడు. వరుస బౌండరీలతో దూకుడు కనబర్చాడు. ఈ పరిస్థితుల్లో మైదానాన్ని పొగమంచు కమ్మేయడంతో కాసేపు ఆటకు అంతరాయం కలిగింది.
షార్ట్ బాల్‌కే అయ్యర్ ఔట్..:ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా శ్రేయస్ అయ్యర్ జోరు కనబర్చాడు. అయితే ట్రెంట్ బౌల్ట్.. అయ్యర్ బలహీనతపై దెబ్బ కొడుతూ షార్ట్ పిచ్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన రాహుల్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడాడు. 54 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని సాంట్నర్ విడదీసాడు.

సూర్య రనౌట్..:రాహుల్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ రాగా.. కోహ్లీ 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే సూర్య(2) విరాట్ కోహ్లీతో సమన్వయలోపం కారణంగా రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 191 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన జడేజాతో కోహ్లీ ఆచితూచి ఆడాడు.
మంచి బంతులను గౌరవిస్తూ చెడ్డ బంతులను బౌండరీకి తరలించాడు. జడేజా కూడా వీలుచిక్కిన బంతిని బౌండరీకి పంపించాడు. భారత్ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. కోహ్లీ 6, 4 బాది సెంచరీపై ఆసక్తి రేకెత్తించాడు. కానీ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి 5 పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నాడు. క్రీజులోకి షమీ రాగా.. జడేజా బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు.