టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. న్యూజిలాండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్‌పై కన్నెర్ర చేశాడు. తన వికెట్ విషయంలో అంపైర్ తప్పిదం చేశాడనే భావనతో ఆగ్రహంగా మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మూడో రోజు ఆటలో టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పేలవ షాట్‌తో ఫుల్‌టాస్‌కు క్లీన్ బౌల్డ్ అయిన విరాట్ కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా బ్యాటింగ్ చేశాడు. 40 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులతో క్రీజులో సెట్ అయినట్లు కనిపించాడు. కానీ మరోసారి మిచెల్ సాంట్నర్ అతన్ని వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.

సాంట్నర్ వేసిన 29వ ఓవర్ చివరి బంతిని కోహ్లీ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్‌ను మిస్సైన బంతి ప్యాడ్లను తాకగా.. న్యూజిలాండ్ బ్యాటర్లు గట్టిగా అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ ఔటిచ్చాడు.
వెంటనే కోహ్లీ రివ్యూ కోరాడు. బంతి లెగ్ స్టంప్‌ను మిస్సవుతుందనే ఆత్మవిశ్వాసంతో రివ్యూ తీసుకున్నాడు. కానీ రీప్లేలో బంతి లెగ్ స్టంప్‌ను కొంచెం తాకుతున్నట్లుగా కనిపించి అంపైర్స్ కాల్‌గా తేలింది. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వడంతో కోహ్లీ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. దాంతోనే తీవ్ర ఆగ్రహానికి గురైన కోహ్లీ.. అంపైర్ వైపు ఆగ్రహంగా చూస్తూ క్రీజును వీడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అభిమానులు అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లింగ్ వర్త్ చాలా సందర్భాల్లో భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని, ముఖ్యంగా 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో అతను తీసుకున్న నిర్ణయాలను మర్చిపోలేమని కామెంట్ చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ వికెట్ అనంతరం టీమిండియా ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, అశ్విన్ వరుసగా పెవిలియన్ చేరారు. దాంతో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేయగా.. అనంతరం భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు కుప్పకూలింది.
103 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేయగా.. భారత్ ముందు 359 పరుగుల లక్ష్యం నమోదైంది. భారీ లక్ష్యచేధనలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 206 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమికి 2 వికెట్ల దూరంలో నిలిచింది.