టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో 9 వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనతను అందుకున్న భారత నాలుగో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.
న్యూజిలాండ్ బౌలర్ విలియమ్ వేసిన 42 ఓవర్‌లో సింగిల్ తీసిన కోహ్లీ టెస్ట్‌ల్లో 9000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. 53 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ సాధించాడు. టీమిండియా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్(15921), రాహుల్ ద్రవిడ్(13265), సునీల్ గవాస్కర్(10122) విరాట్ కోహ్లీ కన్నా ముందున్నారు.

అయితే 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న స్లోయెస్ట్ బ్యాటర్‌గా కోహ్లీ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. కోహ్లీ 197 ఇన్నింగ్స్‌ల్లో 9వేల పరుగుల మైలురాయిని అందుకుంటే.. రాహుల్ ద్రవిడ్ 176 ఇన్నింగ్స్‌ల్లో, సచిన్ టెండూల్కర్ 179 ఇన్నింగ్స్‌ల్లో, సునీల్ గవాస్కర్ 192 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించారు.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక 50 ప్లస్ రన్స్ చేసిన రెండో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకు 596 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 221 సార్లు 50 ప్లస్ రన్స్ చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 264 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. నెంబర్-3లో విరాట్ కోహ్లీకి ఇదే ఫస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
ఈ టెస్ట్‌కు ముందు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో 6 మ్యాచ్‌లు ఆడి 97 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ డకౌటయ్యాడు. దాంతో అతన్ని మూడో స్థానంలో పంపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి మూడో వికెట్‌కు 136 పరుగులు జోడించాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా పోరాడుతోంది. 356 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(63 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 52), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(102 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 70), సర్ఫరాజ్ ఖాన్(78 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
సెంచరీ దిశగా సాగిన విరాట్ కోహ్లీ.. మూడో రోజు ఆటలోని చివరి బంతికి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ ఫిలిప్స్ ఓ వికెట్ పడగొట్టాడు. టీమిండియా ఇంకా 125 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకు ఆలౌటవ్వగా.. న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే.