న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ మరోసారి కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని సింగిల్ హ్యాండ్ డైవ్ క్యాచ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(11) నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు కోహ్లీ షాకయ్యాడు. అలా ఎలా పట్టాడని నోరెళ్లబెట్టాడు. ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా వచ్చిన అతని సతీమణి అనుష్క శర్మ సైతం ఈ క్యాచ్‌ను చూసి అవాక్కైంది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(2)ను మ్యాట్ హెన్రీ వికెట్ల ముందు బోల్తా కొట్టాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ(15) తన ట్రేడ్ మార్క్ పుల్‌షాట్ ఆడబోయి.. జెమీసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్‌తో కలిసి దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన కోహ్లీకి గ్లేన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్‌తో బ్రేక్ వేసాడు. మ్యాట్ హెన్రీ చేసిన 7వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ నాలుగో బంతిని కోహ్లీ గ్యాప్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాక్‌వార్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గ్లేన్ ఫిలిప్స్ కుడివైపు డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో మహమ్మద్ రిజ్వాన్‌ను కూడా ఫిలిప్స్ ఇలానే పెవిలియన్ చేర్చాడు. ఆ మ్యాచ్‌లో ఎడమ వైపు డైవ్ చేసిన ఫిలిప్స్.. తాజా మ్యాచ్‌లో కుడివైపు డైవ్ చేసి అందర్నీఆశ్చర్యపరిచాడు. ఈ క్యాచ్‌కు కామెంటేటర్లు కూడా ఫిదా అయ్యారు. దినేశ్ కార్తీక్, అంబటి రాయుడులు అయితే ఫిలిప్స్ వరల్డ్ బెస్ట్ ఫీల్డర్ అని కొనియాడారు. అనుష్క శర్మ సైతం ఈ క్యాచ్‌ను చూసి సంభ్రమాశ్చర్యానికి గురైంది.
క్రీజులోకి అక్షర్ పటేల్ రాగా.. శ్రేయస్ అయ్యర్ అతనితో కలిసి ఆచితూచి ఆడుతున్నాడు. పవర్ ప్లేలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 37 పరుగులు మాత్రమే చేసింది.