IND vs NZ: చాలా భయపడ్డా.. వారి వల్లే 5 వికెట్ల ఘనత: వరుణ్ చక్రవర్తీ
ఆరంభంలో బౌలింగ్ చేసేందుకు తాను చాలా భయపడ్డానని టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ తెలిపాడు. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ రాణించగలననే నమ్మకం కలిగిందన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా తరుచూ మాట్లాడటం కలిసొచ్చిందని తెలిపాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన టీమిండియా 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. వరుణ్ చక్రవర్తీ(5/42) ఐదు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కెరీర్‌లో ఆడిన రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ఘనతను అందుకొని ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ఘనతను అందుకున్న రెండో భారత బౌలర్‌గానూ వరుణ్ చక్రవర్తీ గుర్తింపు పొందాడు. ఈ అత్యుత్తమ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమష్టి ప్రదర్శనతోనే విజయం సాధించామని తెలిపాడు.

'ఆరంభంలో చాలా భయపడ్డాను. భారత్ తరఫున నేను ఎక్కువగా వన్డే ఫార్మాట్ ఆడలేదు. కానీ మ్యాచ్ సాగుతున్నా కొద్దీ నాపై నాకు నమ్మకం కలిగింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా నాతో తరుచూ మాట్లాడారు. ఇది నాకు కలిసొచ్చింది. గత రాత్రే నేను ఈ మ్యాచ్ ఆడుతున్నాననే విషయం తెలిసింది. దేశం తరఫున ఆడే అవకాశం నాకు ఖచ్చితంగా దక్కుతుందని ముందే ఊహించాను. కానీ కాస్త భయపడ్డాను. ఈ పిచ్ ఏం ర్యాంక్ టర్నర్ కాదు. కానీ సరైన ప్రదేశంలో బంతిని హిట్ చేస్తే వికెట్ నుంచి సహకారం లభించింది. కుల్దీప్, జడ్డూ, అక్షర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. పేసర్లు కూడా రాణించారు. ఇది సమష్టి ప్రదర్శన.'అని వరుణ్ చక్రవర్తీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ ఓవర్లలో 45.3 ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది. కేన్ విలియమ్సన్(120 బంతుల్లో 7 ఫోర్లతో 81) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. వరుణ్ చక్రవర్తీ(5/42) ఐదు వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ యాదవ్(2/56) రెండు వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications