
ఎదురుపడి మాట్లాడే ధైర్యం లేక..
ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ ముందు ఈ ట్రోలింగ్ విషయాన్ని ప్రస్తావించగా.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'భారత జట్టులో ప్రతీ ఒక్కరూ జట్టు గెలవాలనే ఆడుతారు. అత్యున్నత వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాలనుకుంటారు. అంతేకానీ ఈ వెన్నెముక లేని వెదవలను అలరించడానికి కాదు. మనిషికి ఎదురుపడి మాట్లాడే ధైర్యం లేని వాళ్లే, ఇలా సోషల్ మీడియాలో చెత్త వాగుడంతా పోస్ట్ చేస్తుంటారు. వారి ఐడెంటెటీ చూపించుకోవడానికి కూడా ధైర్యం లేని వీళ్లు ఇలా మనుషులను ట్రోల్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు.

చాలా బాధగా ఉంది..
ఇలా ఎదుటి వాళ్లని ఎగతాళి చేయడానికి, వారి ఏమోషన్స్‌తో ఆడుకోవడానికి సోషల్ మీడియా వేదిక కావడం చూస్తుంటే బాధగా ఉంది. ఓ ప్లేయర్ మతాన్ని అడ్డుపెట్టుకుని, అతనిపై దాడి చేయడం దారుణం. మేం జట్టుగా, ప్రతీ ప్లేయర్‌ను అర్థం చేసుకుంటాం. మాకున్న బలం అదే. సోషల్ మీడియా వేదికగా ఎవరినో ఒకర్ని కించపరుస్తున్న వెన్నెముక లేని వెదవల్లా కాకుండా
మా కంటూ ఓ క్యారెక్టర్ ఉండటం వల్లే మేమంతా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాం. ఈ తరహా వెదవలను ఎంకరేజ్ చేయకపోవడమే చాలా మంచిది.

జీవితంలో ఏం సాధించలేదన్న..
ఓ మ్యాచ్‌లో ఓడిపోయామనే బాధకంటే, వారి జీవితాల్లో ఏం సాధించలేదనే ఫ్రస్టేషన్‌ను ఇలా చూపిస్తూ ఉంటారు. ఇలా పోస్ట్‌లు చేసేవారికి వారిపై వారికి నమ్మకం ఉండదు. ఎదుటి వాళ్లతో పోటీపడేందుకు సత్తా ఉండదు. అందుకే తమకంటే మంచి స్థానంలో ఉన్నవాళ్లను తిట్టడానికి కారణాలు వెతుక్కుంటూ కూర్చుంటారు. జట్టులో ప్రతీ ఒక్కరు మహమ్మద్ షమీకి అండగా ఉన్నాం. అతను మ్యాచ్ విన్నర్. 200 శాతం అతను తర్వాతి మ్యాచ్‌లో ఆడుతాడు. ఎవరి సత్తా ఏంటో బయటి వాళ్లు చెబితే తెలుసుకునే స్థాయిలో మేం లేం.'అని కోహ్లీ ఘాటూగా వ్యాఖ్యానించాడు.

బయటి విషయాలు అనవసరం..
ఇక న్యూజిలాండ్‌తో చావో రేవో మ్యాచ్‌పై స్పందిస్తూ.. బయటి పరిస్థితులతో తమకు అనవసరమని, తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చేందుకు ప్రయత్నిస్తామన్నాడు.'భారత్ మరో మ్యాచ్‌లో ఓడిపోవడాన్ని ప్రజలు భరిస్తారా? లేదా? అనేది మాకు అనవసరం. అది మా పని కూడా కాదు. అసలు బయటి విషయాలతో మాకు సంబంధం లేదు. మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. విజయం కోసం 100 శాతం ప్రయత్నిస్తాం. ఒకవేళ ఫలితం అనుకూలంగా లేకుంటే దాన్ని నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాం. క్రికెట్‌లో ప్రతీ మ్యాచ్ కీలకమే'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మతం పేరిట షమీపై..
షమీ ట్రోలింగ్‌ను అటు మాజీ క్రికెటర్లు, అభిమానులు తిప్పికొట్టారు. ఇక ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారం రేపింది. ఎంఐఎం అధినేత ఒవైసీతో పాటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సైతం ఈ ట్రోలింగ్‌ను ఖండించారు. ఇది బీజేపీ కుట్రేనని ఆరోపించారు. భారత్ ఓటమికి మహమ్మద్ షమీ ఒక్కడే బాధ్యుడా? అంటూ నిలదీశారు. దేశంలో ముస్లింల పట్ల ఎంత ధ్వేషం వ్యక్తమౌతున్నదో.. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈ ఓటమికి భారత జట్టు మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుందే తప్ప.. ఏ ఒక్కరికో దాన్ని అంటగట్టడం సరికాదన్నారు. దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్ సైతం ఈ సోషల్ మీడియా రోతకు అడ్డుకట్ట వేయాలన్నారు.


Click it and Unblock the Notifications
