
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వరణుడు మింగేసినా.. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 65 పరుగులతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ(3/34) హ్యాట్రిక్ వికెట్ సాధించగా.. లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. కేన్ విలియమ్సన్(52 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీపక్ హుడా (4/10) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసారు. భువనేశ్వర్ కుమార్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 మంగళవారం జరగనుంది.
192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే ఫిన్ అలెన్(0) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో తొలి ఓవర్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చిన కేన్ విలియమ్సన్.. కాన్వేతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. కానీ అతని జిడ్డు బ్యాటింగ్ ఇతర బ్యాటర్లపై ఒత్తిడిని తెచ్చింది. వేగంగా పరుగులు చేయాలనే ఆలోచనతో కాన్వే భారీ షాట్ ఆడబోయి వెనుదిరిగాడు.
ఆ తర్వాత వచ్చిన గ్లేన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్‌లు కూడా ఇదే తరహా ఒత్తిడికి గురై వికెట్లు పారేసుకున్నారు. కేన్ మామ మాత్రం వన్డే తరహా బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ విజయవకాశాలను దెబ్బతీసాడు. 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను.. సిరాజ్ వేసిన 18వ ఓవర్‌లో ఔటయ్యాడు. కేన్ మామ కాస్త మెరుగైన స్ట్రైక్‌రేట్‌తో ఆడినా.. మ్యాచ్ రసవత్తరంగా మారేది.