సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్న భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ శనివారం వెల్లడించింది. గాయంతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఫిట్‌నెస్ క్లియరెన్స్ సాధిస్తేనే అతను మ్యాచ్‌లు ఆడుతాడని సెలెక్టర్లు స్పష్టం చేశారు.
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని ఈ వన్డే టీమ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్ సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. మహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి తిరిగి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.

శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీతో రుతురాజ్ గైక్వాడ్‌పై వేటు పడింది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అవకాశం దక్కించుకున్న తిలక్ వర్మ కూడా ఉద్వాసనకు గురయ్యాడు. దేశవాళీ వన్డేల్లో సెంచరీల మోత మోగించిన దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్‌లను సెలెక్టర్లు మరోసారి పట్టించుకోలేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు రెస్ట్ ఇచ్చినట్లు తెలిపారు. హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు బౌలింగ్ చేయగలడని బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ధ్రువీకరించలేదని పేర్కొన్నారు. మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇస్తాడని భావించినా.. మరోసారి అతన్ని సెలెక్టర్లు పట్టించుకోలేదు.
ఈ మూడు వన్డేల సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి వన్డే వడోదర, రెండో వన్డే జనవరి 14న రాజ్‌కోట్ వేదికగా, మూడో వన్డే జనవరి 18న ఇండోర్‌లో జరగనుంది. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్ 2026 బరిలోకి దిగే భారత జట్టును ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషభ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.