ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ముంగిట టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ ప్రమోషన్ దక్కింది. అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పునరుద్దరించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది. గతంలో బీసీసీఐ ఆదేశాలను పాటించలేదని శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఇషాన్ కిషన్‌ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను రద్దు చేస్తూ బోర్డు క్రమశిక్షణ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అందుబాటులో ఉన్న సీనియర్ ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించగా.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ బేఖాతరు చేశారు.
దేశవాళీ క్రికెట్‌కు బదులు ఐపీఎల్ ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొన్నారు. దాంతో ఆగ్రహానికి గురైన బీసీసీఐ.. సెంట్రల్ కాంట్రాక్ట్‌లను తొలగించడంతో పాటు టీమిండియాకు దూరంగా ఉంచింది. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించిన శ్రేయస్ అయ్యర్.. మళ్లీ టీమిండియా పిలుపును అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన అతను అనూహ్యంగా.. విరాట్ కోహ్లీ గాయపడటంతో చివరి నిమిషంలో జట్టులోకి వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు.

ఈ సిరీస్‌లో నిలకడగా ఆడిన అతను.. తుది జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే జోరు కనబర్చాడు. 4 మ్యాచ్‌ల్లో 48.75 సగటుతో 195 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. ఇక నాలుగు మ్యాచ్‌ల్లో 40 ప్లస్ రన్స్ చేయడం విశేషం. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో అతను ఆడిన ఇన్నింగ్స్ టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టింది. ఈ క్రమంలోనే అతనికి రివార్డ్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. సాధారణంగా ప్రతీ ఏడాది ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్‌లను బీసీసీఐ ఐపీఎల్ ప్రారంభానికి ముందే ప్రకటిస్తోంది. కానీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఇంకా ఈ కాంట్రాక్ట్‌లను వెల్లడించలేదు.
టోర్నీ ముగిసిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్‌కు ఈసారి మెరుగైన కాంట్రాక్ట్ దక్కే అవకాశం ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రాలు ఏ ప్లస్ కేటగిరిలో కొనసాగుతున్నారు. అయితే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన ఈ ముగ్గురి కాంట్రాక్ట్‌లు మారే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే.. జట్టులో ఉన్న ఆటగాళ్లందరికి మెరుగైన కాంట్రాక్ట్‌లు దక్కనున్నాయి.