ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 250 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్ సంచలన ఫీల్డింగ్‌తో టీమిండియాను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసింది. కళ్లు చెదిరే క్యాచ్‌లతో భారత బ్యాటర్లను పెవిలియన్ చేర్చింది. శ్రేయస్ అయ్యర్(98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 79) హాఫ్ సెంచరీతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది.
అయ్యర్‌కు తోడుగా అక్షర్ పటేల్(61 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42), హార్దిక్ పాండ్యా(45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(5/42) ఐదు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, విల్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీసారు.

శుభారంభం లేదు..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పవర్ ప్లేలోనే టాప్-3 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(2)ను మ్యాట్ హెన్రీ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ(15) తన ట్రేడ్ మార్క్ పుల్‌షాట్ ఆడబోయి.. జెమీసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్‌తో కలిసి దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన కోహ్లీకి గ్లేన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్‌తో షాకిచ్చాడు. దాంతో భారత్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న అక్షర్, అయ్యర్..
ఈ పరిస్థితుల్లో లెఫ్టాండర్‌గా బ్యాటింగ్‌లో ప్రమోషన్ అందుకున్న అక్షర్ పటేల్..శ్రేయస్ అయ్యర్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ.. క్రీజులో సెట్ అయిన అనంతరం వేగంగా పరుగులు చేసింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ 75 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ ముంగిట.. కేన్ విలియమ్సన్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఫీల్డింగ్‌తో దెబ్బతీసారు..
క్రీజులోకి కేఎల్ రాహుల్(23) రాగా.. శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడాడు. ఇదే జోరులో ఓ రూర్కీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే కేఎల్ రాహుల్‌ను మిచెల్ సాంట్నర్ పెవిలియన్ చేర్చాడు. జడేజాతో కలిసి హార్దిక్ పాండ్యా తన దైన షాట్లతో జట్టు స్కోర్‌ను 200 ధాటించాడు. 41 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని కేన్ విలియమ్సన్ స్టన్నింగ్ సింగిల్ హ్యాండ్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. మహమ్మద్ షమీ(2)తో కలిసి హార్దిక్ పాండ్యా భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. జెమీసన్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్స్‌తో 15 పరుగులు రాబట్టిన హార్దిక్.. ఆఖరి ఓవర్‌లో క్యాచ్ ఔటయ్యాడు. షమీ కూడా వెనుదిరగడంతో భారత్ 249 పరుగులకే పరిమితమైంది.