న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. విధ్వంసకర బ్యాటింగ్.. కళ్లు చెదిరే బౌలింగ్‌తో ఏకపక్ష విజయాలు అందుకున్న టీమిండియాకు న్యూజిలాండ్ ఎట్టకేలకు కళ్లెం వేసింది. విశాఖపట్నం వేదికగా బుధవారం జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా విఫలమైన టీమిండియా 50 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఎక్స్‌ట్రా బౌలర్‌తో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది.
216 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 18.4 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. శివమ్ దూబే(23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. రింకూ సింగ్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) పర్వాలేదనిపించాడు. అభిషేక్ శర్మ(0), సూర్యకుమార్ యాదవ్(8), హార్దిక్ పాండ్యా(2) తీవ్రంగా నిరాశపర్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(3/26) మూడు వికెట్లు తీయగా.. జాకోబ్ డఫీ(2/33), ఇష్ సోధి(2/46) రెండేసి వికెట్లు తీసారు. మ్యాట్ హెన్రీ, జాక్ ఫోక్స్ తలో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమ్ సీఫెర్ట్(36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. డెవాన్ కాన్వే(23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44), డారిల్ మిచెల్(18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/33), కుల్దీప్ యాదవ్(2/39) రెండేసి వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-3తో నిలిచింది. ఆఖరి టీ20 తిరువనంతపురం వేదికగా శనివారం జరగనుంది.
గాయంతో ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోకుండా అర్ష్‌దీప్ సింగ్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ ఆడించింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా టీమ్‌మేనేజ్‌మెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్స్‌ట్రా బ్యాటర్ లేకుంటే.. ఎలా ఆడుతారని బ్యాటర్లను టెస్ట్ చేసినట్లు అర్థమవుతుంది.