టీమిండియా స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ సాధించాడు. 110 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదే తొలి శతకం. శుభ్‌మన్ గిల్ గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కీలక సమయంలో సెంచరీతో రాణించి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.
అయితే ఇలా డకౌట్ అయిన తర్వాత సెంచరీ చేయడం ద్వారా సర్ఫరాజ్ ఖాన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యి రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన 9వ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్, సునిల్ గవాస్కర్ సరసన నిలిచాడు.

ఈ జాబితాలో మాధవ్ ఆప్టే అగ్రస్థానంలో ఉన్నాడు. 1953లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌లో మాధవ్ ఆప్టే తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై.. రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులు చేశాడు. 1977లో సునీల్ గవాస్కర్(0, 118), 1979లో దిలీప్ వెంగ్‌సర్కార్(0, 103), 1989లో మహమ్మద్ అజారుద్దీన్(0, 109), 1999లో సచిన్ టెండూల్కర్(0, 136), 2014లో శిఖర్ ధావన్(0, 114), 2017లో విరాట్ కోహ్లీ(0, 104), 2024లో శుభ్‌మన్ గిల్(0, 119) సర్ఫరాజ్ కన్నా ముందు ఈ ఫీట్ సాధించారు.
ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో 3 వికెట్లకు 344 పరుగులు చేసింది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(125 బ్యాటింగ్)తో పాటు రిషభ్ పంత్(53 బ్యాటింగ్) ఉన్నాడు. నాలుగో రోజు ఆటలో న్యూజిలాండ్ ఒక్క వికెట్ తీయలేకపోయింది. వర్షం కారణంగా అంపైర్లు లంచ్ బ్రేక్‌ను ముందుగానే ప్రకటించారు. దాంతో తొలి సెషన్‌లో 22 ఓవర్ల ఆటనే సాధ్యమైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అనంతరం న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో ఆ జట్టుకు 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.