టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ తన కీపింగ్‌తో మైమరిపించాడు. మహేంద్ర సింగ్ ధోనీ తరహాలో సూపర్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. అతని స్టన్నింగ్ క్యాచ్‌కు న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే(0) సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు.
సంజూ స్టన్నింగ్ క్యాచ్‌కు న్యూజిలాండ్ ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోగా.. స్లిప్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎగిరి గంతేసాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. సంజూ శాంసన్‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు.

239 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు తొలి ఓవర్‌లోనే బిగ్ షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే డెవాన్ కాన్వే కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఫుల్లిష్ డెలివరీని కాన్వే కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి సంజూ శాంసన్‌కు ఎడమవైపు దూరంగా దూసుకెళ్లింది. ఇది గమనించిన సంజూ వెంటనే డైవ్ చేసి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. దాంతో కాన్వే నిరాశగా వెనుదిరిగాడు. ఈ క్యాచ్‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు. 'సంజూ స్టన్నింగ్ క్యాచ్.. పోలా అదిరిపోలా!'అని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌తో 84) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 32), రింకూ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 నాటౌట్) మెరుపులు మెరిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ డఫీ(2/27), కైల్ జెమీసన్(2/54) రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్టియన్ క్లార్క్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.