న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌ను టీమిండియా దారుణంగా ప్రారంభించింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా చెత్త బ్యాటింగ్‌తో 46 పరుగులకే కుప్పకూలింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియాకు ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. టీమిండియా ఘోర వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడమే రోహిత్ సేన చేసిన తప్పిదమని కొందరంటే.. విరాట్ కోహ్లీని మూడో స్థానంలో బ్యాటింగ్ పంపించడం ప్రధాన కారణమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పిచ్ కండిషన్స్‌ను పట్టించుకోకుండా దూకుడుగా ఆడటమే టీమిండియా కొంపుముంచిందని అనిల్ కుంబ్లే వంటి మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

అది నా నిర్ణయం..
టెస్ట్‌ల్లో నాలుగో స్థానంలో ఆడే విరాట్ కోహ్లీని మూడో స్థానంలో ఆడించడం.. అతను డకౌట్‌గా వెనుదిరగడం టీమిండియా పతనానికి కారణమైందని అభిప్రాయపడుతున్నారు. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విమర్శలపై స్పందించాడు. ఓవర్‌కాస్ట్ కండిషన్స్ నేపథ్యంలోనే బ్యాటింగ్ ఎంచుకున్నానని స్పష్టం చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేయడం తాను తీసుకున్న నిర్ణయమని తెలిపాడు.
శుభ్‌మన్ గిల్ దూరమవ్వడంతోనే తప్పని పరిస్థితుల్లో విరాట్ కోహ్లీని మూడో స్థానంలో బ్యాటింగ్ పంపించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. 'మేం కేఎల్ రాహుల్ బ్యాటింగ్ స్థానాన్ని టచ్ చేయవద్దనుకున్నాం. అతన్ని ఆ స్థానంలోనే ఆడించాలని భావించాం. అలాగే సర్ఫరాజ్ ఖాన్‌కు కూడా పూర్తిగా స్వేచ్చనిస్తూ నాలుగో స్థానంలో ఆడించాలనుకున్నాం.
పిచ్‌ను అంచనా వేయలేకపోయాం..
దాంతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు ముందుకు వచ్చాడు. ఆటగాళ్లు ఇలా బాధ్యతలు చేపట్టడం శుభసూచకం. కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చినందుకే ఇలా జరగలేదు. పిచ్ అంచనా వేయడంలో మేం విఫలమయ్యాం. తొలి సెషన్ తర్వాత పేసర్లకు పెద్దగా అనుకూలించదని భావించాం.
వికెట్ పూర్తిగా ఫ్లాట్‌గా మారి బ్యాటింగ్‌కు అనుకూలిస్తోందని పొరపడ్డాం. పిచ్‌ను సరిగ్గా రీడ్ చేయలేకపోవడం మేం చేసిన అతి పెద్ద తప్పిదం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం నా ఒక్కడి నిర్ణయం. నా కెప్టెన్సీలో 46 పరుగులకే ఆలౌటవ్వడం తీవ్ర నిరాశకు గురి చేసింది. 'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.