టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు తీవ్ర గాయమైంది. న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో వికెట్ కీపింగ్ చేస్తూ పంత్ గాయపడ్డాడు. బంతి నేరుగా అతని కుడి మోకాలికి బలంగా తాకడంతో పంత్ కుప్పకూలాడు.
సర్జరీ అయిన చోటే బంతి బలంగా తాకడంతో నొప్పితో విలవిలలాడాడు. ఫిజియోలు వచ్చి ప్రథమ చికిత్స అందించినా లాభం లేకపోయింది. దాంతో వారి భుజాలపై చేతులు వేసి అతి కష్టంగా పంత్ మైదానం వీడాడు. రవీంద్ర జడేజా వేసిన 37వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని డెవాన్ కాన్వే డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో అతను విఫలమయ్యాడు.

బ్యాట్‌ను మిస్సైన బంతి ఆఫ్ స్టంప్‌కు దగ్గరగా వెళ్తూ రిషభ్ పంత్ కుడి మోకాలికి బలంగా తాకింది. ప్యాడ్స్ కవర్ కాకపోవడం.. సర్జరీ జరిగిన ప్లేస్ కావడంతో పంత్ నేలకూలాడు. ఫిజియోల సాయంతో అతి కష్టం మీద మైదానం వీడాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు. ఇక రెండో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. పంత్ గాయం గురించి కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
రిషభ్ పంత్ మోకాలు వాచిందని, ఇప్పటికే అక్కడ సర్జరీ జరగడంతో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పాడు. మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షణ చేస్తుందని, అతని విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోమని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌లోనే అతను మళ్లీ బరిలోకి దిగుతాడని ఆశిస్తున్నామని తెలిపాడు.
'రిషభ్ పంత్ మోకాలు వాచింది. అదే మోకాలికి సర్జరీ అయింది. అతని విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోం. ఇదే మ్యాచ్‌లో అతను మళ్లీ బరిలోకి దిగుతాడని ఆశిస్తున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
రెండేళ్ల క్రితం రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అతని బీఎండబ్ల్యూ కారులో ఒంటరిగా ఇంటికి బయలుదేరిన పంత్.. నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమవ్వగా.. ఓ బస్ డ్రైవర్, కండక్టర్ సాయంతో పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలతో 15 నెలల పాటు ఇంటికే పరిమితమయ్యాడు. మోకాలితో పాటు ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో పంత్‌కు పలు సర్జరీలు కూడా చేశారు. మళ్లీ సర్జరీ జరిగిన చోటే గాయమవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది.