టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. తమకు న్యాయం.. ప్రత్యర్థికి ఒక న్యాయమా? అంటూ ఫీల్డ్ అంపైర్లను నిలదీసాడు. న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ నాలుగో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. 231/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది.
సర్ఫరాజ్ ఖాన్(195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లతో 150), రిషభ్ పంత్(105 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 99) రాణించినా... లోయరార్డర్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో ప్రత్యర్థి ముందు 108 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. 4 బంతులు ఆడగానే ఆ జట్టు ఓపెనర్లు బ్యాడ్ లైట్ అంటూ అంపైర్లకు ఫిర్యాదు చేసారు. బంతి కనిపించడం లేదని చెప్పారు.

వారి ఫిర్యాదు పరిగణలోకి తీసుకున్న అంపైర్లు ఆటను నిలిపివేసారు. దాంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఉదయం నుంచి తాము బ్యాడ్ లైట్ అంటూ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అంపైర్లు.. న్యూజిలాండ్ చెప్పగానే ఎలా ఆటను నిలిపేస్తారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు తాము కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే బ్యాటింగ్ చేశాం కదా..? అని నిలదీసారు.
బ్యాడ్ లైట్ ఉందని ముందుగానే ఆటను ఆపేయాల్సిందని గట్టిగా వాదించారు. కాసేపటికే వర్షం రావడంతో ఆటగాళ్లంతా మైదానం వీడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాసేపు ఆట సాధ్యమైనా.. ఫీల్డ్ చేసి అలసిపోయిన న్యూజిలాండ్ బ్యాటర్లను ఔట్ చేయవచ్చని టీమిండియా భావించింది. కానీ వరణుడు వారి ఆశలపై నీళ్లు చల్లాడు.
4 బంతులు ఆడిన న్యూజిలాండ్ ఒక్క పరుగు కూడా చేయలేదు. 107 పరుగుల లక్ష్యమే ఉన్నా.. విజయం కోసం టీమిండియా ప్రయత్నించడం అద్భుతమని నెటిజన్లు కొనియాడుతున్నారు. స్పిన్నర్లు అద్భుతం చేస్తే తప్పా ఈ మ్యాచ్‌లో టీమిండియా గట్టెక్కే పరిస్థితులు లేవు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 పరుగులకు ఆలౌటవ్వగా.. న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దాంతో టీమిండియా 356 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.
రోహిత్ శర్మ(63 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 52), విరాట్ కోహ్లీ(102 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 70) హాఫ్ సెంచరీలతో గట్టి పునాది వేయగా.. సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు 177 పరుగులు జోడించారు. కానీ ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో వారి పోరాటానికి విలువ లేకుండా పోయింది. కనీసం 150-200 పరుగుల లక్ష్యం నమోదు చేసినా గెలవడానికి ఆస్కారం ఉండేది.
చివరి రోజు నాలుగో ఇన్నింగ్స్ ఆడటం ఏ జట్టుకైనా కష్టమే. కానీ స్వల్ప లక్ష్యం ఉండటంతో న్యూజిలాండ్ ఆచితూచి ఆడే అవకాశం ఉంది. గతంలో ఈ స్కోర్‌ను కూడా కాపాడుకున్న రికార్డ్ టీమిండియాకు ఉంది. వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యం కాకపోతే మ్యాచ్ డ్రాగా ముగియనుంది.