న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీ చెత్తగా ఉందని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫీల్డ్ సెటప్ బాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీని తప్పుబట్టాడు.
అటాకింగ్ ఫీల్డ్ సెట్ పెట్టకుండా డిఫెన్సివ్ ఫీల్డ్ పెట్టాడని తెలిపాడు. 'ఫీల్డ్ సెటప్ విషయంలో రోహిత్ శర్మ తప్పు చేశాడు. అప్పటికే ఆధిక్యంలో కొనసాగుతున్న జట్టును కట్టడి చేయాలంటే వికెట్లు తీయడమే లక్ష్యంగా బౌలింగ్ చేయాలి. అందుకు తగ్గట్లుగా ఫీల్డ్ సెటప్ ఉండాలి. కానీ న్యూజిలాండ్ 85 పరుగులు చేసే వరకు భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే తీసింది. ఇక్కడే రోహిత్ శర్మ కెప్టెన్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.

తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసిన న్యూజిలాండ్ .. భారత్‌ను 156 పరుగులకే ఆలౌట్ చేసి 103 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. ఈ పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్‌ను 120 పరుగులకు ఆలౌట్ చేయాడానికి వ్యూహాలు రచించి ఉంటే భారత్‌కు గెలవడానికి ఆస్కారం ఉండేది. కానీ న్యూజిలాండ్ ఒక్క వికెట్ కోల్పోకుండా 60 పరుగులు చేసింది. అప్పుడైనా రోహిత్ శర్మ తన వ్యూహాన్ని మార్చాల్సింది.
ఔట్ ఫీల్డ్‌లో ఆటగాళ్లను మోహరించి.. పరుగులను తగ్గించే ప్రయత్నం చేయకుండా.. ఇన్‌ఫీల్డ్‌లో ఉంచి వికెట్లు తీసే ప్రయత్నం చేయాల్సింది. వెంట వెంటనే వికెట్లు పడితే వాళ్లపై ఒత్తిడి పెరిగేది. అప్పుడు వికెట్లు తీసేందుకు వీలుండేది.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. క్రీజులో టామ్ బ్లండెల్(30 బ్యాటింగ్) తో పాటు గ్లేన్ ఫిలిప్స్(9 బ్యాటింగ్) ఉన్నాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ ఆధిక్యం 301 పరుగులకు చేరింది. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవడం కష్టం.
అంతకుముందు 16/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(7/53) స్టన్నింగ్ బౌలింగ్‌తో టీమిండియా పతనాన్ని శాసించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసిన విషయం తెలిసిందే. డెవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76), రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(7/59), రవిచంద్రన్ అశ్విన్(3/64) కివీస్ పతనాన్ని శాసించారు.