ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో సర్ఫరాజ్ ఖాన్‌కు బంతి తాకరాని చోట తాకగా.. మైదానంలో నవ్వులు పూసాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో టీమిండియా ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది.
షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్.. చాలా చురుకుగా వ్యవహరించాడు. సర్ఫరాజ్ ఖాన్ కారణంగానే న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్ వికెట్ భారత్‌కు దక్కింది. ఈ వికెట్ విషయంలో సర్ఫరాజ్ ఖాన్.. డీఆర్‌ఎస్ తీసుకోవాలని రోహిత్ శర్మతో పట్టుబట్టాడు. సందేహంగానే రోహిత్ డీఆర్‌ఎస్ తీసుకోగా.. ఫలితం అనుకూలంగా వచ్చింది.

అంతలా ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్.. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో కలిసి కూడా నవ్వులు పూయించాడు. ప్రత్యర్థి బ్యాటర్లను తమ మాటలతో ఆటపట్టించారు. అయితే షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. సర్ఫరాజ్ ఖాన్‌కు ప్రైవేట్ పార్ట్ భాగంలో బంతి తాకింది. అశ్విన్ వేసిన 79వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ ఐదో బంతిని మిచెల్ సాంట్నర్ డ్రైవ్ షాట్ ఆడాడు. బౌన్స్ అయిన బంతి సర్ఫరాజ్ ఖాన్ రహస్య ప్రదేశంలో తాకింది. ఇది చూసి రిషభ్ పంత్ పడి పడి నవ్వుకున్నాడు. కామెంటేటర్స్ అయితే తమ సంభాషణతో మరింత నవ్వించారు. మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఈ ఘటనను వివరిస్తూ.. 'సర్ఫరాజ్ ఖాన్ ఏ మాత్రం ఇష్టపడని చోట బంతి తాకింది'అన్నాడు. వెంటనే రవి శాస్త్రి 'ప్రస్తుతం అతనో తండ్రి'అని పేర్కొన్నాడు. దాంతో కామెంట్రీ ప్యానెల్‌లో నవ్వులు పూసాయి.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తండ్రి అయ్యాడు కాబట్టి తాకిన ఏం కాదా? రవి శాస్త్రి అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండో టెస్ట్ ప్రారంభానికి ముందే సర్ఫరాజ్ ఖాన్ తండ్రి అయిన విషయం తెలిసిందే. అతని భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సర్ఫరాజ్ ఖానే ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్(7/59), రవిచంద్రన్ అశ్విన్(3/64) అసాధారణ ప్రదర్శనతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. డెవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76), రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిచెల్ సాంట్నర్(51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) పర్వాలేదనిపించాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ .. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(0) తీవ్రంగా నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్(6 బ్యాటింగ్), శుభ్‌మన్ గిల్(10 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ ఓ వికెట్ తీసాడు. భారత్ ఇంకా 243 పరుగుల వెనుకంజలో ఉంది.