ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ముందు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ భారత పర్యటనకు వచ్చింది. జనవరి 11న వడోదర వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో కివీస్ టూర్ ప్రారంభం కానుంది. ఇప్పటికే న్యూజిలాండ్ భారత్ చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ కీలక ఆటగాళ్లు మిచెల్ సాంట్నర్, టామ్ లాథమ్, రచిన్ రవీంద్రలు దూరంగా ఉన్నారు. దాంతో మైఖేల్ బ్రేస్‌వెల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి.
అయితే భారత్‌తో తలపడే న్యూజిలాండ్ వన్డే జట్టులో భారత సంతతికి చెందిన ఆదిత్య అశోక్ చోటు దక్కించుకున్నాడు. అతని స్వస్థలం తమిళనాడులోని వేలూరు. ఆదిత్యకు 4 ఏళ్లు ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు న్యూజిలాండ్‌కు వలస వెళ్లారు.
ఆదిత్యకు తన తాతతో చక్కటి అనుబంధం ఉంది. మరణించిన తన తాతకు గుర్తుగా బౌలింగ్ చేసే తన చేతిపై సూపర్ స్టార్ రజనీకాంత్ 'నా దారి రహదారి'అనే డైలాగ్‌ను తమిళ అక్షరాలతో టాటూ వేయించుకున్నాడు. ఈ సినిమాను ఆదిత్య తన తాతతో కలిసి చూశాడు.

23 ఏళ్ల ఆదిత్య అశోక్ తన సెలవు దినాల్లో తరచూ భారత్‌కు వచ్చేవాడు. అయితే గతేడాది పర్యటన మాత్రం అతనికి ప్రత్యేకంగా నిలిచిపోయింది. కొన్ని వారాలపాటు చెన్నైలోని సీఎస్‌కే అకాడమీలో అతను కొంతకాలం శిక్షణ తీసుకున్నాడు. దాంతో అతనికి ఇక్కడి పిచ్ కండిషన్స్‌పై పట్టు లభించింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ ఆదిత్య అశోక్‌కు అవకాశం కల్పించింది.
'ముందుగా నేను చెన్నై అనుభవం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అలాంటి అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నా. బ్లాక్ సాయిల్ పిచ్, రెడ్ సాయిల్ పిచ్‌లపై నాకు మంచి అవగాహన వచ్చింది. అవి ఎలా ప్రవర్తిస్తాయో ఒక అంచనా ఏర్పడింది. చెన్నైలో శ్రీరామ్ కృష్ణమూర్తితో కలిసి ఆడటం మంచి అనుభవాన్ని ఇచ్చింది. అందుకు నేను కృతజ్ఞుడిని.
ఆల్‌టైమ్ ఫేవరేట్ స్పిన్నర్ ఎవరంటే.. షేన్ వార్న్ అని చెబుతా. ఫేన్ వార్న్ కాదని చెప్పడం కష్టం. కానీ న్యూజిలాండ్‌లో పెరగడటం వల్ల ఇష్ సోధీ బౌలింగ్‌ను ఇష్టపడేవాడిని. ప్రస్తుతం అతనితో నాకు చక్కటి అనుబంధం ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అతను నాకు పెద్దన్నలాంటోడు. ఆయన ఆటను చూస్తూ నేను పెరిగాను. అలానే నా ప్రస్తుత మెంటార్ తరుణ్‌ను కూడా దగ్గర నుంచి చూసే అవకాశం రావడం నా అదృష్టం.'అని అశోక్ ఆదిత్య చెప్పుకొచ్చాడు.